కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పల్లె పండుగ 3.0’ (Palle Panduga ) కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈ బృహత్తర కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
కాగా, ‘పల్లె పండుగ 3.0’ అమలు కోసం కూటమి ప్రభుత్వం ఏకంగా రూ. 11,085 కోట్ల భారీ నిధులను మంజూరు చేయగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,694 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 5,391 కోట్ల నిధులను విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిధుల ద్వారా పంచాయతీల్లో సిసి రోడ్లు, బిటి రహదారులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, గోకులాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను వేగవంతం చేయనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు వేలాదిగా తరలివచ్చే ప్రజల కోసం రామాపురంలో జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా భద్రత, సభా ఏర్పాట్లను పూర్తి చేశారు.

