కలం, స్పోర్ట్స్ : భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రయాణంలో టీ20, వన్డేలలో విజయాలు ఓ వైపు ఉంటే.. టెస్టులలో వైఫల్యాలు మరోవైపు కనిపిస్తున్నాయి. రాబోయే శ్రీలంక సిరీస్ నేపథ్యంలో గంభీర్ టెస్టు రికార్డుపై చర్చ జరుగుతోంది. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ 19 టెస్టులు ఆడగా.. 7 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 10 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్ కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
మరోవైపు గంభీర్ కోచ్‌గా టీ20, వన్డేలలో మాత్రం భారత్ అద్భుత విజయాలు సాధించింది. టీ20 ప్రపంచకప్‌తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా టీమిండియా కైవసం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 48.15 శాతంతో భారత్ ఐదో స్థానంలో ఉంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో రెడ్ బాల్, వైట్ బాల్ క్రికెట్‌కు వేర్వేరు కోచ్‌లను నియమించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే టెస్టులలో మూడో స్థానంలో బ్యాటర్లను తరచూ మార్చడంపైనా విమర్శలు వస్తున్నాయి.
గంభీర్‌కు అమిత్ మిశ్రా అండ
ఈ విమర్శలపై మాజీ భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా (Amit Mishra) స్పందించారు. గౌతమ్ గంభీర్‌కు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించారు. కోచ్‌ను నిందించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. జట్టులో కొత్త ఆటగాళ్లు ఉన్నందున వారు అంతర్జాతీయ క్రికెట్‌కు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుందని మిశ్రా పేర్కొన్నారు. పిచ్ పరిస్థితులను ఆటగాళ్లే అర్థం చేసుకుని, పరిస్థితులకు అనుగుణంగా తమ ఆటను మార్చుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. కోచ్ పని ఆటగాళ్లకు మార్గదర్శనం చేయడమేనని, మైదానంలో ఆడి జట్టును గెలిపించాల్సింది ఆటగాళ్లేనని అమిత్ మిశ్రా స్పష్టం చేశారు. దీంతో గంభీర్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో మిశ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

