కలం ,మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా మూసాపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి. జానకి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాల వివరాలు, పెండింగ్ కేసులు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను మర్యాదపూర్వకంగా వారి సమస్యలను విని చట్టబద్ధంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పోలీసుల సేవల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగేలా ప్రతి బాధితునికి సత్వర స్పందన అందించాలని సూచించారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ, నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని తెలిపారు. సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ శాఖ ప్రతిష్టను మరింత పెంచేలా పనిచేయాలని సూచించారు.
అనంతరం స్టేషన్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ, వారి శాఖాపరమైన అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధుల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే నేరుగా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) స్టేషన్ పరిధిలోని ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, సిబ్బందితో సమన్వయం పెంచుకుని సమర్థవంతమైన పర్యవేక్షణ చేపట్టాలని ఎస్పీ డి. జానకి ఆదేశించారు. మూసాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి NH-44 ఉండటంతో పాటు వేముల ఎక్స్ రోడ్ మరియు జానంపేట సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తూ, ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, మూసాపేట ఎస్ఐ వేణు, అడ్డాకల్ ఎస్ఐ మురళి, భూత్పూర్ ఎస్ఐ నాగన్నతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

