కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లా(Mahabubnagar)లో మే 13 నుండి జరుగనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు లైన్ డిపార్ట్మెంట్ లు తమవంతు బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ప్రజావాణి హాల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ పై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుండి 20వ తేదీ వరకు ఉంటాయని, మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9.00 నుండి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు నిర్వహించడం జరుగుతుంది. వనపర్తి జిల్లాలో మొత్తం 5,175 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని.. ఇందులో మొదటి సంవత్సరం 3,068 ఉన్నారని తెలిపారు. ఇందులో వొకేషనల్ 412 మంది ఉండగా.. ద్వితీయ సంవత్సరం 1474 మంది ఉన్నారని వెల్లడించారు. ద్వితీయ సంవత్సరంలో వొకేషనల్ 221 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేవిధంగా ఆయా రూట్లలో ఆర్టీసీ బస్సులు సకాలంలో నడపాలని సూచించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను విద్యార్థులకు కల్పించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రంలో ఒఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జడ్పీ సి.ఈ.ఓ యాదయ్య, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నరేందర్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

