కలం, మహబూబ్ నగర్ బ్యూరో : పేదల ఆపిల్‌గా పిలిచే సీతాఫలం (Custard Apple) ఈ ఏడాది సామాన్యులకు అందనంత ఎత్తులో నిలిచింది. ప్రకృతి ప్రసాదించిన ఈ వనరుపై ఆధారపడి బతికే వేలాది మంది నిరుద్యోగులు, గిరిజనుల ఆశలపై ‘ఎల్‌నినో’ నీళ్లు చల్లింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ సీజన్లో కనిపించాల్సిన పండగ కళ ఈసారి కానరావడం లేదు. ప్రకృతి కన్నెర్ర తో వర్షాలు సరిగలేక, అరకోర వర్షాలకు పూసిన పూత ఎండ వేడిమికి వాడి రాలిపోయింది.
దీంతో ఈ ఏడాది భారీగా దిగుబడి తగ్గిపోయింది. సాధారణంగా ప్రతి ఏటా ఆగస్టు నుంచి నవంబర్ వరకు పాలమూరు గుట్టలు, అటవీ ప్రాంతాలు సీతాఫలాల సేకరణతో కోలాహలంగా ఉంటాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతం, ఇతర గుట్టల నుంచి సహజసిద్ధంగా లభించే ఈ పండ్లే వేలాది కుటుంబాలకు ఉపాధి. కానీ ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వాతావరణం ప్రతికూలంగా మారింది.
దీంతో వేలాది కుటుంబాలు ఉపాధి లేక రోడ్డుపై పడ్డాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో చెట్లు నీటి ఎద్దడిని ఎదుర్కొన్నాయి. పూత, పిందె దశలో ఉండగానే ఎండల తీవ్రత, తేమ లేకపోవడంతో కాయలు రాలిపోయాయి. చెట్టున నిలిచిన కొద్దిపాటి కాయలు కూడా చిన్నగా, నల్లబడిపోయాయి. కొన్ని బూజు పట్టి పోయాయి.
ఉపాధికి గండి.. మోడువారిన ఆశలు
సీతాఫలం సీజన్ వచ్చిందంటే చాలు.. వ్యవసాయ పనులు లేని కూలీలు, గిరిజన మహిళలు, నిరుద్యోగ యువత ఉదయాన్నే అడవి బాట పడతారు. బుట్టల కొద్దీ పండ్లు సేకరించి హైవేల పక్కన, పట్టణాల్లో విక్రయించి నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. కానీ ఈసారి అడవికి వెళ్ళిన వారికి నిరాశే ఎదురవుతోంది. చెట్లపై కాయలు లేక ఉత్తి చేతులతో వెనుదిరుగుతున్నారు. గతంలో రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదించే వీరు, ఈసారి కనీసం పెట్రోల్ ఖర్చులు కూడా రాక ఇబ్బంది పడుతున్నారు.
అందనంత ఎత్తులో ధరలు
సామాన్యుడికి అందనంత దూరంలో ధరలు ఉండడం మూలంగా సీతాఫలాన్ని కొనడానికి ప్రజలు జంకుతున్నారు. దిగుబడి భారీగా తగ్గడంతో మార్కెట్లో సీతాఫలం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో సామాన్యుడికి అందుబాటులో ఉండే ఈ పండు ఇప్పుడు ఒక్కొక్కటి 20 నుంచి 30 రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. ఒక్కో బుట్ట 400 నుంచి 600 రూపాయల వరకు పలకడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం సీతాఫలం భారీగా రేటు పలుకుతూ నిజమైన ఆపిల్ ధరతో పోటీ పడుతోంది.
ధరలు బాగున్నా అమ్మడానికి రైతులు, సేకరణదారుల వద్ద సరుకు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఏటా దసరా, దీపావళి సమయంలో కళకళలాడే సీతాఫలాల మార్కెట్లు ఈసారి వెలవెలబోతున్నాయి. ఎల్ నినో ప్రభావం కేవలం పంట్లనే కాదు, వాటిని నమ్ముకున్న పేద బతుకులను కూడా దెబ్బతీసింది. ప్రకృతి కరుణిస్తే తప్ప, ఈ ‘సీతాఫలం’ మళ్ళీ పేదవాడి పండుగా మారే పరిస్థితి కనిపించడం లేదు.
పెట్టిన డబ్బుల్లో సగం వచ్చిన అదృష్టమే
మహబూబ్‌నగర్‌కు ముఖ్యంగా నవాబ్ పేట, మహబూబ్‌నగర్ పరిసర ప్రాంతాల నుంచి రైతులు సీతాఫలాలను తీసుకొస్తారు. అయితే ఈసారి టెండర్ దక్కించుకున్న టెండర్‌దారులు మేము పెట్టిన పెట్టుబడి సగం వచ్చిన అదృష్టంగా భావిస్తామని తెలిపారు. గత ఏడాది రూ 4.10 లక్షల కు నవాబుపేట మండలం టెండర్‌ను పాడగా, ఈ ఏడాది రూ. 6. 74 లక్షలకు టెండర్ పాడినట్లు టెండర్ దారుడు మహమ్మద్ మక్షుద్ అలీ తెలిపారు. అలాగే మహబూబ్‌నగర్ గత ఏడాది ఎనిమిది లక్షలకు పాడగా ఈ ఏడాది 17 లక్షలకు టెండర్‌ను పాడినట్లు తెలిసింది.
అయితే వర్షాభావ పరిస్థితుల మూలంగా జిల్లా అటవీ శాఖ అధికారి టెండర్ల ప్రక్రియను తొందరగా పూర్తి చేయడంతో భారీగా నష్టపోయినట్టు టెండర్‌దారులు తెలిపారు. వాస్తవానికి ఆగస్టు చివరలో టెండర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా అంతకంటే ముందే టెండర్‌ను పూర్తి చేయడంతో వర్షాభావ పరిస్థితుల్లో చాలా నష్టపోవాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఏడాది కనీసం 10 శాతం కూడా దిగుబడి రాలేదని, టెండర్ దారు మహమ్మద్ మాక్ క్సుద్ అలీ ఆవేదన వ్యక్తం చేశారు.

