పెండింగ్ భూసేకరణపై కలెక్టర్ సీరియస్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: జిల్లాలో జాతీయ రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ భూసేకరణ పురోగతిని పరిశీలించారు. సమావేశంలో భారత్‌మాల జాతీయ రహదారి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, మ్యూటేషన్, రహదారి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కొన్ని ప్రాంతాలలో భూసేకరణ పూర్తయి రహదారి నిర్మాణ పనులు ముగిశాయని, మరికొన్ని ప్రాంతాలలో  భూసేకరణ, పరిహారం చెల్లింపులు, మ్యూటేషన్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

భూత్పూర్ మండలంలోని కోడూరు–హస్నాపూర్ గ్రామాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులపై కూడా సమావేశంలో చర్చించారు. జాతీయ రహదారి నిర్మాణ పనులలో ఎలాంటి ఆలస్యం జరగకుండా భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. జడ్చర్లలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఇన్‌స్పెక్షన్ బంగ్లా భూములకు సంబంధించిన అంశాన్ని కూడా సమీక్షించారు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన వెంటనే అవార్డులు జారీ చేయాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని సూచించారు.

రాజీవ్ భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ సమస్యలను పరిష్కరించి మిగిలిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని రిజర్వాయర్‌లకు సంబంధించిన భూసేకరణ అంశాలపై కూడా సమీక్షించారు. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికలు, ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా పంపించాలని కలెక్టర్ సూచించారు. ఉదండపూర్ రిజర్వాయర్ పరిధిలో రైతులకు పరిహారం చెల్లింపులు, పెండింగ్ కేసుల పరిష్కారం, హైకోర్టులో ఉన్న కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

భూసర్వేలను వేగవంతం చేసేందుకు అవసరమైతే అదనపు లైసెన్స్ సర్వేయర్లను వినియోగించాలని, రోజువారీ పురోగతి నివేదికలను సమర్పించాలని అధికారులకు సూచించారు. ఉదండపూర్ పునరావాస పనులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణను కూడా త్వరగా పూర్తి చేయాలని, సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, ఆర్డీఓ నవీన్, భూ సర్వే రికార్డుల శాఖ ఏడి అశోక్, NHAI అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>