నల్లగొండ జిల్లాలో విద్యాసంస్థల బంద్ సక్సెస్

కలం, నల్లగొండ: ప్రభుత్వ పాఠశాలల విలీనం వ్యతిరేకించడంతో పాటు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి గాను నల్లగొండ (Nalgonda) జిల్లాలో చేపట్టిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల బంద్ విజయవంతంగా ముగిసింది.

ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బంద్ సందర్భంగా విద్యార్థి నాయకులు జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు.

విద్యా రంగం నిర్వీర్యం..

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి శంకర్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరు సాగర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిగొండ మురళీకృష్ణ, డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్‌ మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు కిలోమీటర్ల పరిధిలోని 273 ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు.

పోస్టులు తక్షణమే భర్తీ చేయాలి..

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, ల్యాబ్‌లు, లైబ్రరీల వంటి మౌలిక వసతులు కల్పించాలన్నారు.

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడం, పుస్తకాలు, యూనిఫామ్‌ల పేరుతో తల్లిదండ్రులను బలవంతంగా దోచుకోవడం ఆపేలా కఠిన చర్యలు చేపట్టాలన్నారు.

పెండింగ్‌ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో అందక పేద విద్యార్థులు ఉన్నత విద్యకు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్, పిడిఎస్‌యూ జిల్లా కార్యదర్శి పవన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు గాదెపాక సూర్య తేజ, ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్‌తో పాటు విద్యార్థి సంఘాల నాయకులు బి.వి చారి, సైఫ్, ఆదిల్, వేణు, కండె యాదగిరి, రావణ్, భాను, గౌతమ్, ప్రసాద్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>