కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు నేడు మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న అంశాలను వారికి వివరించారు. రాష్ట్రం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని, స్థానికంగా పెట్టుబడులు పెట్టి తయారీ రంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో తయారీ రంగంలో పెట్టుబడులకు దేశంలోనే బెస్ట్ స్టేట్ తెలంగాణ అని మంత్రి వారికి సూచించారు.
సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు వంటి అధునాతన తయారీ రంగాల్లో తెలంగాణలో ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. తెలంగాణ–జర్మనీ మధ్య పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నూతన సాంకేతికతలు, పెట్టుబడులు, తయారీ రంగ అభివృద్ధికి రాష్ట్రం అనుకూల వాతావరణాన్ని అందిస్తుందని తెలిపారు.

