ఢిల్లీకి మెదక్‌ ‘ప్రోటోకాల్’ రచ్చ.. అధికారులకు రఘునందన్ వార్నింగ్!

క‌లం మెద‌క్ బ్యూరో: మెదక్ ఎంపీ ర‌ఘ‌నంద‌న్ రావు (Raghunandan Rao).. తెలంగాణ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌. వేదిక ఏదైనా తన వాగ్దాటితో ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వడంలో ముందుంటాడు. అలాంటి పేరున్న ర‌ఘ‌నంద‌న్ రావు త‌ను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మెద‌క్ లోక్‌సభ నియోజకవర్గంలో త‌రుచుగా ప్రోటోకాల్ ఉల్లంఘ‌న‌లు జ‌రుతున్నాయని అసంతృప్తికి గురవుతున్నాడు. త‌న ఇలాకాలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నాడు. ఎంపీ ర‌ఘ‌నంద‌న్ రావుకు ప్రొటోకాల్ తీసుకొస్తున్న త‌ల‌నొప్పులు ఏంటి? వ‌రుస‌గా ప్రోటోకాల్ (Protocol) ఉల్లంఘనలు ఎందుకు ఎదురవుతున్నాయి? అనే ఇష్యూపై ‘కలం’ స్టోరీ

ప్రభుత్వ కార్యక్రమాలకు ‘నో’ ఇన్విటేషన్

మెద‌క్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం.. ఉమ్మడి మెద‌క్ జిల్లాలోని సంగారెడ్డి, మెద‌క్, సిద్ధిపేట జిల్లాల ప‌రిధిలో ఏడు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో విస్తరించి ఉంది. ఇందులో సంగారెడ్డి జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, మెద‌క్ జిల్లాలో రెండు, సిద్ధిపేట జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. అయితే ఎంపీ ర‌ఘ‌నంద‌న్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లు ప్రభుత్వ కార్యక్రమాల‌కు ఆహ్వానం అంద‌టం లేద‌ట‌. ఈ క్రమంలో అధికారుల తీరుపై ఆయన విరుచుకుపడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈఎస్‌ఐ (ESI) ఆస్పత్రి కార్యక్రమానికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మంత్రులు గడ్డం వివేక్, దామోదర రాజనర్సింహాలు ఈఎస్ఐ డిస్పెన్సరీని ప్రారంభించారు. కానీ, ఈ అధికారిక కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావును ఆహ్వానించకపోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, క‌నీస‌ం ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ కార్యక్రమాల‌ను ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. సమాచారం ఇవ్వని జిల్లా అధికారులపై నోటీసులు పంపిస్తామని హెచ్చరించారు. ప్రోటోకాల్ రూల్స్ పాటించనివారిపై కచ్చితంగా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

మొక్కుబడిగా సమాచారం

గ‌త నెల జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ (NHM) నిధులతో జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన ఆసుపత్రి ప్రారంభోత్సవంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఎంపీ అయిన రఘునందన్ రావు (Raghunandan Rao)కు ఎలాంటి అధికారిక ఆహ్వానం అందలేదు. చివ‌రి నిమిశంలో మొక్కబ‌డిగా స‌మాచారం ఇవ్వడంపై జిన్నారం మున్సిపల్ కమిషనర్ తీరుపై రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద మూడు హాస్పిటల్ మంజూరు చెప్పిస్తే , కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించే హాస్పిటల్స్ తనకు తెలియకుండా ప్రారంభోత్సవం ఎలా చేస్తారని నిలదీశారు. కమిషనర్ స్థానిక పటాన్‌చెరు ఎమ్మెల్యే ప్రస్తావించడంతో ‘మీకు పోస్టింగ్స్ ఇప్పిస్తున్నారని అని ఆయన చెప్పినట్టు చేస్తారా’ అని ఎంపీ ఫైర్ అయ్యారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. జిన్నారం మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని ఎంపీ రఘునందన్ జిల్లా కలెక్టర్‌ను, అధికారులను ఆదేశించారు. మెద‌క్ పార్లమెంట్ ప‌రిధిలో ప్రభుత్వ కార్యక్రమాలకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని, చివ‌రికి కేంద్ర నిధులతో చేపట్టిన కార్యక్రమానికి సైతం స్థానిక ఎంపీకి సమాచారం ఇవ్వకపోవడంపై బీజేపీ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి. బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తమ నాయకుడిని ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండా, అధికారులు లైట్‌గా తీసుకోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. కొన్ని సంద‌ర్భాల్లో అధికారులు నిర్లక్ష్యం, మరికొన్ని సంద‌ర్భాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల తీరు వల్ల రఘునందన్ రావుకు సమాచారం అందడం లేదని తెలుస్తోంది.

ఎంపీ హెచ్చరికలు

ప్రోటోకాల్ పాటించకుండా సమాచారం ఇవ్వని జిల్లా సంబంధిత అధికారులకు నోటీసులు పంపిస్తామని, ఉల్లంఘ‌న‌ల‌పై పార్లమెంటు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తానని ఎంపీ ర‌ఘ‌నంద‌న్ రావు హెచ్చరించారు. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన ఘటనలపై త్వరలోనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, సదరు అధికారులను ఢిల్లీకి పిలిపిస్తామని ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. త‌న పార్లమెంట్ పరిధిలో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఎంపీ రఘునందన్ రావు లీగల్‌గా, పార్లమెంటరీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుండటంతో మెదక్‌లో ‘ప్రోటోకాల్’ ఇష్యూ మరింత ముదురుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>