కలం, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు(Supreme Court)లో శుక్రవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా ఫిర్యాదుదారుడు వాదించడానికి కోర్ట్ హాల్‌కు వచ్చాడు. బెంచ్‌పై జస్టిస్ కే.వి.విశ్వనాథన్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఉన్నారు. వాదన వినిపించే క్రమంలో సదరు వ్యక్తి పూర్తిగా కంట్రోల్ తప్పాడు. ఏసీపీపై వెంటనే కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులనే ఆదేశించాడు.
ఊహించని ఘటనతో అక్కడున్న లాయర్లు షాకయ్యారు. ఇంతలో జస్టిస్ కే.వీ.విశ్వనాథన్ జోక్యం చేసుకుని.. “మీరు మమ్మల్ని ఆదేశిస్తున్నారా.. ” అని అడగ్గా.. “అవును, నేను ఆదేశిస్తున్నా” అంటూ సమాధానమిచ్చాడు.
పేపర్లు గాల్లోకి విసిరేసి..
సదరు వ్యక్తి మాట్లాడుతూ సీజేఐపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. పేపర్లను గాల్లోకి విసిరేశాడు. అప్రమత్తమైన సెక్యూరిటీ అతడిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు లాయర్లు వెంటనే ఇద్దరు జడ్జిలను కోరారు.
స్పందించిన జస్టిస్ కే.వీ.విశ్వనాథన్.. అతను చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నట్లు కనిపిస్తున్నాడని, వదిలిపెట్టాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం మరో కేసు వాదనలను కొనసాగించారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. సదరు వ్యక్తి ఇష్టారీతిన మాట్లాడుతున్నా.. ప్రశాంతంగా వ్యవహరించిన ఇద్దరు జడ్జిలపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

