కలం, వెబ్ డెస్క్: వైకుంఠ ఏకాదశిని (Vaikuntha Ekadashi) పురస్కరించుకుని తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ మాడ వీధుల్లో బంగారు రథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి భక్తుల మధ్య ఊరేగుతూ దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఈ రథోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వర్ణ రథంపై కొలువుదీరిన మలయప్పస్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి ఊరేగింపును దర్శించి, హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాయి.
ఇక మరోవైపు వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా ఉత్తరద్వార దర్శనంకోసం తిరుమలకు భక్తుల పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శిస్తే వైకుంఠ లోక ప్రాప్తి కలుగుతుందన్న విశ్వాసంతో లక్షలాది మంది భక్తులు తిరుమల బాట పట్టారు. దీంతో కొండపై భారీగా రద్దీ నెలకొంది. క్యూ లైన్లు కిలోమీటర్ల మేర విస్తరించగా, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు, టీటీడీ సిబ్బంది భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచుతూ టీటీడీ (TTD) ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతూ, భక్తజన సంద్రంగా మారింది.
Read Also: భద్రాద్రిలో వైకుంఠ ద్వార దర్శన మహోత్సవం
Follow Us On: Sharechat


