కలం, వెబ్‌డెస్క్: జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కవిత బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. వివిధ జిల్లాలో పర్యటిస్తూ ఆయా నేతలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలను గుప్పిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డిపై కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మీద విమర్శలు చేశారు. దీంతో కవిత చేసిన అవినీతిని బయటపెడతానంటూ మాధవరం వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయ్యింది.
కవిత భర్తకు ఆ భూమి ఎక్కడిది?
కవిత ఆరోపణలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని కవిత కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రాజకీయ జీవితాన్ని కవిత నాశనం చేశారని విమర్శించారు. కవిత కేసీఆర్‌ను నాశనం చేసేందుకు వచ్చారని మండిపడ్డారు. కవిత మంచిది కాదు కాబట్టే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేశారని ఆరోపించారు. కవితకు హైదరాబాద్ లో అంత పెద్ద ఇల్లు ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఏ రాజకీయనాయకుడికి లేనంత పెద్ద ఇల్లు కవితకు ఉందని పేర్కొన్నారు.
బీసీలు అప్పుడు గుర్తుకు రాలేదా?
గతంలో పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు బీసీలు గుర్తుకురాలేదా? అని మాధవరం (Madhavaram Krishna Rao) విమర్శించారు. కవిత భర్తకు బాలానగర్ లో 36 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. సర్వే నంబర్ 20, 21 లో కవిత భర్త పేరు మీద ఉన్న భూమి అక్రమంగా సంపాదించుకున్నదని విమర్శించారు. కవిత అవినీతిని బయటపెడతానని పేర్కొన్నారు. ఇటీవల కవిత వరసగా బీఆర్ఎస్ నేతలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి వ్యవహారాలను కవిత బయటపెడ్తుండగా.. ఆమె అవినీతి చేసిందని బీఆర్ఎస్ లీడర్లు విమర్శిస్తున్నారు. ఇలా ఒకరిమీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారు.
Read Also: గ్రేటర్ హైదరాబాద్ మరింత గ్రేటర్.. 300 వార్డులతో కొత్త రూపం
Follow Us On: X(Twitter)


