Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రైవేట్ బడి బస్సుల్లో భద్రత ఎంత? పిల్లల ప్రాణాలతో యాజమాన్యాల చెలగాటం

కలం, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్ స్కూళ్లు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఇంటి దగ్గరే పిల్లల పికప్, డ్రాపింగ్ ఉంటుందని చెప్పి స్కూల్ బస్సుల (School Buses) కోసం ఫీజుల మీద ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. బస్సులను మాత్రం కండిషన్ లేనివి పంపుతున్నాయి. వాటి ఫిట్‌నెస్‌ను గాలికి వదిలేస్తున్నాయి. శిక్షణ లేని డ్రైవర్లకు బస్సులు అప్పగిస్తున్నాయి. ప్రతీ విద్యా సంవత్సరంలో స్కూళ్లు రీ-ఓపెన్ అయ్యేటప్పుడు బస్సుల ఫిట్‌నెస్‌పై రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ చేయడం, తూతూ మంత్రంగా తనిఖీలు చేసి సర్టిఫికెట్లు జారీచేయడం రొటీన్ ప్రాక్టీసుగా మారిపోయింది. ఈసారి కూడా అదే తంతు.

చూసీ చూడనట్టు..!

సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్ స్కూళ్లు రీ–ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ప్రారంభమై.. క్లాసులు కూడా చెప్తున్నాయి. రవాణా శాఖ నిర్వహించిన ఫిట్‌నెస్ డ్రైవ్ గణాంకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అధికారిక వివరాల ప్రకారం.. రాష్ట్రంలో విద్యాసంస్థల ఆధ్వర్యంలో మొత్తం సుమారు 26 వేల స్కూల్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 21 వేల వాహనాలకు శనివారం వరకు ఫిట్‌నెస్ తనిఖీలు పూర్తయ్యాయి. గతేడాదితో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడింది. బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీకి మాత్రమే మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు పరిమితమయ్యారని.. వాటి పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కంట్రోల్ సర్టిపికెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటి భద్రతా సౌకర్యాల విషయంలో చూసీ చూడనట్లుగానే ఉన్నట్లు ఆ శాఖ వర్గాలే పేర్కొంటున్నాయి.

ఏడాదంతా తనిఖీలేవి?

బస్సుల ఫిట్‌నెస్ టెస్ట్, సర్టిఫికెట్ జారీ వారం రోజుల ప్రహసనంగానే ఉండిపోతున్నది. ఆ తర్వాత పర్యవేక్షణలో రవాణా శాఖ నిర్లక్ష్యంగానే ఉంటున్నది. డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్, టైమ్‌కు చేరాలనే ఒత్తిడి, వాహనాలకు సరైన నిర్వహణ లేకపోవడం, పాత బస్సులనే నడిపిస్తుండడం ఇవన్నీ కామన్. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఏడాది పొడవునా జరగాల్సిన ఈ డ్రైవ్ స్కూళ్ల రీ-ఓపెనింగ్ వరకే పరిమితమవుతున్నది. అన్ని జిల్లాల్లో ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల ఫిట్‌నెస్‌పై ‘కలం’ ప్రతినిధులు గ్రౌండ్ రిపోర్ట్ చేయగా.. అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇదీ పరిస్థితి..!

వరంగల్: ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్‌కు 10 ఏండ్ల అనుభవంతోపాటు పోలీస్ వెరిఫికేషన్ మస్ట్‌గా ఉండాలి. అయితే 70% ప్రైవేట్ స్కూల్స్ ఇలాంటి నిబంధనలు పాటించడం లేదు.

మెదక్: గతేడాది ఉమ్మడి మెదక్ జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన, ఫిట్‌నెస్ లేని 50కి పైగా స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఫిట్‌నెస్ లేకుండా రోడ్డెక్కే బస్సులను తక్షణమే సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నా.. అడ్డదారుల్లో స్కూల్ యాజమాన్యాలు బయటకు తీస్తున్నాయి.

మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 55 స్కూల్ బస్సులకు ఫిట్ నెస్ లేదని ఇటీవల అధికారులు సీజ్ చేశారు. అవినీతి అధికారులను మచ్చిక చేసుకొని కొందరు.. బురిడీ కొట్టించి ఇంకొందరు.. ఫిట్ నెస్ లేని బస్సులను రోడ్లమీదికి తెస్తున్నారు.

కరీంనగర్: ఆర్టీఏ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా పైపైన చూసి పర్మిషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 15 ఏండ్లు పైబడిన బస్సులను కూడా బడుల కోసం వాడుతున్నారు. రూల్స్‌కు అనుగుణంగా లేని 20కి పైగా బస్సులను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.

నల్లగొండ: మొత్తం 1,678 స్కూల్ బస్సులు ఉండగా.. ఇప్పటివరకు 1,076 బస్సులకు మాత్రమే టెస్టులు పూర్తయ్యాయి. ఇంకా 602 బస్సులు ఫిట్‌నెస్ టెస్టులు పూర్తి చేసుకోలేదు.

నిజామాబాద్: ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లలో 50 శాతం మంది మాత్రమే శిక్షణ పొందిన డ్రైవర్లు ఉన్నారు. మిగతావారు ఎప్పటికప్పుడు ఉపాధి కోసం నేర్చుకున్న వారే. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>