కలం, మెదక్ బ్యూరో: తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయానికి (Edupayala Temple) నిత్యం వేలాదిగా, జాతరలు, పర్వదినాల్లో లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆలయ పాలకమండలిపై ఉంటుంది. అయితే, రెండేళ్లుగా చైర్మన్తో పాటు పూర్తిస్థాయి పాలకమండలి లేకపోవడంతో ఆలయాభివృద్ధి కుంటుపడటమే కాకుండా సమస్యలు చుట్టుముట్టాయి.
కొత్త పాలకమండలిని ఎప్పుడు నియమిస్తారనేదానిపై భక్తుల్లోనూ, స్థానికంగా విస్తృత చర్చ జరుగుతోంది. మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం నాన్సన్ పల్లి వద్ద మంజీరా నది ఏడు పాయలుగా విడిపోయి, అమ్మవారి ఆలయం చుట్టూ ప్రవహిస్తుంది. వర్షాకాలంలో నది ప్రవాహం ఎక్కువై నీరు నేరుగా ఆలయంలోకి వచ్చి అమ్మవారి పాదాలను తాకడం ఎంతో ప్రత్యేకం. ఏటా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వంచే అధికారికంగా నిర్వహించే జాతరకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
అభివృద్ధి ప్రణాళికలు లేక
భక్తుల సంఖ్య ఏటా పెరుగుతుండగా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. జాతరలు, పండుగలు, ప్రత్యేక రోజుల్లో పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, రోడ్లు, క్యూ లైన్లు, వసతి, విద్యుత్, భద్రత వంటి చర్యలు తీసుకోవడంలో ఆలయ (Edupayala Temple) చైర్మన్తో పాలకమండలిది ప్రధానపాత్ర. అధికారులు చర్యలు తీసుకుంటున్నా స్థానికంగా భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం పాలకమండలి బాధ్యతగా ఉంటుంది.
దేవస్థానానికి రెండేళ్లుగా చైర్మన్, 14 మంది ధర్మకర్తలతో కూడిన పాలక మండలి లేకపోవడంతో అభివృద్ధి లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన ప్రణాళికాబద్ధంగా లేదు. ఆలయానికి వచ్చిన నిధులను ఈవో ద్వారా ఖర్చు చేస్తున్నప్పటికీ చైర్మన్, పాలకమండలి లేనిలోటు స్పష్టంగా కన్పిస్తుంది.
అధికారంలోకి వచ్చినా..
మరోవైపు ధర్మకర్తలతో కూడిన పాలకమండలి లేకపోవడంతో కొత్త పాలకమండలి ఎప్పుడు ఏర్పాటు చేస్తారనేందుకు స్థానిక అధికార పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా ఖాళీగా ఉన్న చైర్మన్ పదవి, పాలకమండలి పదవుల కోసం ఆశావహులు పోటీపడుతున్నారు. పార్టీ అధికారం రావడానికి కష్టపడిన పలువురు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే పెద్దగా ఆసక్తి చూపకపోవడం చర్చనీయంగా మారింది. ఎమ్మెల్యే సహకరం లేకపోవడంతో ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచిన నియామకం జరగలేదని ఆ పార్టీ నేతలు చెబుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా భర్తీ చేసి తమకు అవకాశాలు కల్పించాలని పార్టీ పెద్ద లీడర్లను కోరుతున్నారు. కొత్త పాలకమండలి ఎప్పుడు ఏర్పాటు చేస్తారనేందుకు ఎదురుచూడడమే మిగిలింది.
Also Read : హరీశ్ రావు వాగ్వాదం.. స్పీకర్ వార్నింగ్
Follow Us On: X(Twitter)

