కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి (Erravelli) లోని మాజీ ముఖ్యమంత్రి, బీఆఎస్ అధినేత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం (KCR Farmhouse) పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ను వెయ్యి డప్పులతో ముట్టడించాలని కాంగ్రెస్ నేత సతీష్ మాదిగ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
మరోవైపు మర్కుక్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలు రైతు దీక్ష చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల పోటాపోటీ కార్యక్రమాల నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ప్రధాన రహదారులపై ఎక్కడికక్కడ తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, ప్రయాణించే వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా బీఆర్ఎస్ నేతలను, పలువురు కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు.
అలాగే, పరిస్థితిని అదుపు చేసేందుకు 144 సెక్షల్ అమలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పిలుపునిచ్చిన క్రమంలో పోటాపోటీగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఫామ్ హౌస్ వద్దకు చేరుకుంటున్నారు. ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసినా పోలీసుల పహారా కాస్తుండటంతో ఎర్రవల్లిలో ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది.

