కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో పెద్ద స్కాం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆరోపించగా.. మంత్రి లోకేశ్ (Lokesh) తిప్పికొట్టారు. ఈ మేరకు ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను. మీ అయిదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మరింత బిగ్గరగా ఏడవడానికి సిద్ధంగా ఉండండి’ అని జగన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.
టీచర్లకు సారీ చెప్పాల్సిందే..
జగన్ లక్ష్యంగా మంత్రి లోకేశ్ ఘాటైన విమర్శలు గుప్పించారు. ‘మీరు టెన్త్ పేపర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని, అందరూ అలాగే ఉంటారనుకోవడం చాలా పెద్ద నేరం. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చదివి ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవమానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచర్లకు జగన్ లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పాలి. మెగా డీఎస్సీ ఆపాలని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉద్యోగాలు లేకుండా వారి భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్న మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు’ అని పేర్కొన్నారు.

