కలం, వెబ్ డెస్క్: యూపీలోని లక్నోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సివిల్స్ (Civils) ప్రిలిమ్స్ బాగా రాయలేకపోయానని ప్రఖార్ పాల్ అనే అభ్యర్థి గోమతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి తల్లి ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్. కుమారుడి మరణవార్త విన్న ఆమె.. గుండెలవిసేలా రోదిస్తోంది. అతడి తండ్రి కొన్నాళ్ల కిందటే అనారోగ్యంతో చనిపోగా.. కుమారుడిని ఉన్నత ఉద్యోగంలో చూడాలని కలలు కన్నది. ప్రఖార్ సైతం చదువులో చురుగ్గా రాణించేవాడు. సివిల్స్ చదువుతానని కోరడంతో ఆమె అంగీకరించి.. కొన్నాళ్లుగా సిద్ధం చేయిస్తోంది.
తల్లికి చెప్పి మరీ..
ఆదివారం జరిగిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష కఠినంగా రావడంతో తాను క్వాలిఫై కాలేనని ప్రఖార్ పాల్ ఇంటికి వచ్చాక తల్లితో చెప్పి బాధపడ్డాడు. అయినా ఫర్వాలేదని.. మరోసారి రాసేందుకు ప్రిపేర్ కావాలని ప్రోత్సహించింది. అయితే, ఫెయిల్ అవుతామోననే మనో వేదనను తట్టుకోలేకపోయిన ప్రఖార్.. తన స్కూటీపై గోమతి నది ఒడ్డుకు వెళ్లి అందులో దూకి మరణించాడు. ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు పరిశీలించి.. అతడి తల్లికి విషయం తెలియజేశారు. ఆమె పని చేస్తున్న కాలేజీకి కొద్ది దూరంలోనే నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు డెడ్ బాడీని బయటకు తీయించి, ఆసుపత్రికి తరలించారు.

