కలం, వెబ్డెస్క్: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య లోక్సభ రేపటికి వాయిదా (Lok Sabha Adjourned) పడింది. గురువారం ఎంజీఎన్ఆర్ఈఏ స్థానంలో జి రామ్ జి బిల్లు ఆమోదం పొందగానే సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. దీంతో ఢిల్లీ గాలి కాలుష్యంపై సాయంత్రం జరగాల్సిన చర్చ ఆగిపోయింది. అంతకుముందు గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్(గ్రామీణ)– వీబీ జి రామ్ జి బిల్లు ఆమోదం పొందింది. దీంతో 20 ఏళ్ల కొనసాగుతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చినట్లైంది. కొత్త బిల్లులో పని దినాలను 125 రోజులకు పెంచారు. బిల్లు ఆమోదం కోసం సభలో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించి వేసి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, శీతాకాల సమావేశాలకు రేపు ఆఖరిరోజు.


