కలం, మహబూబాబాద్: కొద్ది రోజులుగా మహబూబాబాద్ జిల్లా గూడూరు, ఖానాపురం, అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారం (Leopard Movement) స్థానికుల్లో భయాందోళన కలిగిస్తుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిధిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో గుర్తించిన పాదముద్రలు ప్రాథమికంగా చిరుతపులివేనని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ రావు తెలిపారు. రైతులు అందించిన సమాచారం మేరకు మండల కేంద్ర సమీపంలోని కోడి చెరువు ప్రాంతంలో శనివారం సాయంత్రం ప్రాంతంలో ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రం వైపు వెళ్లాడు. ఈ క్రమంలో పక్కనే ఏపుగా పెరిగిన జీలుగా మొక్కలలో ఏదో శబ్దం చేస్తూ జంతువు కదిలినట్లు గమనించాడు.
దీంతో భయపడిన రైతు ఆదివారం ఉదయం మరికొందరు రైతులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లగా ఓ జంతువు పాదముద్రలు చూసి ఫారెస్ట్ అధికారులకు తెలియజేశాడు. ఈ మేరకు అధికారులు ఘటన స్థలములో పాదముద్రలను పరిశీలించారు. అవి చిరుత పులికి చెందినవేనని ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిరుత కనిపించినా, అనుమా నాస్పద కదలికలు గమనించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

