కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపై నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలు, క్యాడర్ తీవ్ర అసంతృప్తితో తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఎమ్మెల్యే వ్యవహారశైలితో విసిగిపోయిన పలువురు సీనియర్ నాయకులు తమ నిరసనను వ్యక్తం చేసేందుకు ఏకమయ్యారు.
ఈ క్రమంలో జమ్మికుంట శివారులోని ఒక ప్రైవేట్ వెంచర్‌లో సుమారు 100 మందికి పైగా కీలక నేతలు రహస్యంగా సమావేశమవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ సర్పంచ్‌లు, సీనియర్ నాయకులు పాల్గొని ఎమ్మెల్యే తీరుపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. పార్టీలో పాత తరం నాయకులను పట్టించుకోకుండా, ఏకపక్ష నిర్ణయాలతో క్యాడర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కంటే వ్యక్తిగత ప్రాబల్యం కోసమే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంతర్గత కలహాలు రాబోయే రోజుల్లో హుజూరాబాద్ బిఆర్ఎస్ భవితవ్యాన్ని ఏ మలుపు తిప్పుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

