కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి (Erravalli) గ్రామంలో రైతుల భూముల్లో మంగళవారం సర్వే కొనసాగింది. సర్వే నంబర్ 325 పరిధిలో భూములను రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. రైతులకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక బృందాలతో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. క్షేత్రస్థాయిలో పక్కాగా హద్దులు నిర్ధారించేందుకు అధికారులు నాలుగు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రైతులు తమ పొలాల వద్దకు చేరుకుని, ప్రభుత్వం గతంలో అందజేసిన పాత పట్టా పాస్ పుస్తకాలు, ఇతర భూ పత్రాలను అధికారులకు సమర్పించారు.
ప్రస్తుతం తాము సాగు చేసుకుంటున్న భూముల సరిహద్దుల వివరాలను రైతులు క్షుణ్ణంగా వివరించారు. మిగిలిన రైతులకు కొత్తగా నోటీసులు జారీ చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. సర్వే జరుతున్న తీరును గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ స్వయంగా పరిశీలించి అధికారులు, రైతులతో మాట్లాడారు. మిగిలిన రైతుల భూముల్లో ఈ వారం సర్వేను కొనసాగించనున్నారు.

