దొరల భూములు దొంగల కబ్జా .. వరంగల్‌లో రెచ్చిపోతున్న భూ మాఫియా

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్‌ లో భూ మాఫియా (Land Mafia) ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రభుత్వ భూములు, పేదల అసైన్డ్ భూములు, దొరల పేరుతో ఉన్న భూములను కబ్జా పెడుతున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో పట్టాదారుల నుంచి కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా హనుమకొండలోని వడ్డేపల్లి శివారులోని పింగిలి రణధీర్ రెడ్డికి చెందిన 29 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో పట్టాదారుడికి సంబంధించిన వ్యక్తులు ఈ విషయాన్ని పోలీసులకు దృష్టికి తీసుకెళ్లడంతో కబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది.

భూ మాఫియా ఆగడాలకు అడ్డేదీ?

హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా వరంగల్ (Warangal) కు పేరుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం వరంగల్ ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో నగర శివారు భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా హంటర్ రోడ్, భద్రకాళి చెరువు, వడ్డేపల్లి చెరువు శిఖం భూములను మట్టితో పూడ్చి ప్లాట్లు వేస్తున్నారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను బెదిరించి, ఫోర్జరీ డాక్యుమెంట్లతో లాక్కుంటున్నారు. పాతకాలం నాటి దొరల పేరుతో ఉన్న భూముల రికార్డులు తారుమారు చేసి సొంతం చేసుకుంటున్నారు. ఆఖరికి గుడి భూములను కూడా వదలడం లేదనే ప్రచారం జరుగుతోంది.

రెవెన్యూ అధికారుల సహకారం..

భూ మాఫియాకు (Land Mafia) కొందరు రెవెన్యూ అధికారులు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. కబ్జారాయుళ్లు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రికార్డుల్లో పేర్లు మార్చేస్తున్నట్లు సమాచారం. అడ్డు వచ్చిన వారిని బెదిరింపులు, దాడులకు దిగుతూ రాత్రికి రాత్రే ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టేయడం లాంటి దుశ్చర్యలకు తెగిస్తున్నారు. జులాయి యువతను పోగేసి మందు విందులతో కబ్జా స్థలాలు వద్ద కాపలా పెడుతున్నట్లు సమాచారం. ఇటీవల ఐనవోలు మండలం వెంకటాపూర్ లో కాంగ్రెస్ నేత కట్టా మనోజ్ రెడ్డి.. పింగిలి దొర పేదలకిచ్చిన 130 ఎకరాల భూమిని తన పేరిట, బంధువుల పేరుతో కబ్జా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆ భూముల కబ్జా తీరును వివరించి.. వెంటనే ఆ భూములను నిజమైన లబ్ధిదారులకు అందజేయాలని కోరారు. ఈ మేరకు స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే ఆ భూములపై విచారణకు ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికారులు సర్వే మొదలుపెట్టారు.

మాజీల అండదండలు!

గత ప్రభుత్వ హయాంలో భూ బకాసురుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధరణి పోర్టల్ లోని లొసుగుల ఆధారంగా విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా అప్పటి ఎమ్మెల్యేలు (మాజీలు) బినామీ ల పేరిట వందల ఎకరాలు ఆక్రమించినట్లు ప్రచారంలో ఉంది. తాజాగా వడ్డేపల్లి శివారులోని పింగిలి రణధీర్ రెడ్డి‌కి చెందిన 29 ఎకరాల భూమిపై మాజీ ఎమ్మెల్యే అనుచరులు కన్నేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. హాసన్ పర్తి మండలం దేవన్నపేట కు చెందిన రియల్టర్లు ఆ భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రంగ ప్రవేశంతో కబ్జాదారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

Read Also: రేపు చంద్రబాబు పరిస్థితి కూడా అదే! .. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>