కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్‌లో పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జరిగిన ‘నిజామాబాద్ ప్రీమియర్ లీగ్’ (Nizamabad Premier League) ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని DSA గ్రౌండ్ నుంచి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు నిర్వహించగా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. జిల్లాలో అనేక మంది క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్లిన చరిత్ర ఉందని, అలాంటి ప్రతిభను ప్రోత్సహించడం ఆనందకరమని ఆయన అన్నారు. ఈ లీగ్‌లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. విజేతలకు ప్రైజ్ మనీ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
యువతను సన్మార్గంలో నడిపించడమే లక్ష్యంగా ఈ సమ్మర్ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ (CP Sai Chaitanya) తెలిపారు. కోవిడ్ సమయంలో జిల్లాలో దాదాపు 200 మంది మరణించగా, 2025లో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువగా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని, అందరూ తప్పనిసరిగా నియమాలు పాటించాలని ఆయన సూచించారు. అలాగే డ్రగ్స్, సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
‘సే నో టు డ్రగ్స్, సే యెస్ టు స్పోర్ట్స్’ (Say No to Drugs Say Yes to Sports) అనే నినాదాన్ని కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేయించారు. యువతే దేశ భవిష్యత్తు అని, క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా బలంగా మారాలని ఆయన తెలిపారు. అనంతరం కాగడాతో క్రీడా ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ పాత కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి కోర్టు చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, ఎన్టీఆర్ చౌరస్తా, పోలీస్ కార్యాలయం, విజయ్ థియేటర్, రైల్వే కమాన్, అయ్యప్ప దేవాలయం, మీ-సేవ మీదుగా పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో డీసీపీ బస్వా రెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, యువత, క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: రేపు చంద్రబాబు పరిస్థితి కూడా అదే! .. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

