కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా లక్ష్మణచందా మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని రికార్డులు, పెండింగ్ కేసులు, బెయిల్ కేసుల నిర్వహణ, ఆయుధాగారం, సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించిన ఎస్పీ, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవనాన్ని పరిశీలించి, నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై శ్రావణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

