కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నుంచి ‘క్యా బోల్తీ పబ్లిక్’ (Kya Bolti Public) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) ప్రకటించింది. ప్రజలను ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యమని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో రెండు రోజులపాటు జరిగిన సీజేపీ కోర్ కమిటీ సమావేశాల అనంతరం గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పెరుగుతున్న చదువుల భారం, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత లోపించడం, జవాబుదారీతనం, సంస్థాగత సంస్కరణలు వంటి అంశాలపై ప్రధానంగా ప్రస్తావించారు. ఈ సమస్యలను జాతీయ స్థాయిలో ప్రజా ఉద్యమాల ద్వారా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.
ఇటీవల నిర్వహించిన నిరసనల్లో విద్యార్థులతో పాటు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారని దీప్కే పేర్కొన్నారు. డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ సరైన ఉద్యోగాలు లేకపోవడంతో, యువత అనివార్య పరిస్థితుల్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లుగా పనిచేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. నిరుద్యోగాన్ని జాతీయ సమస్యగా ముందుకు తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. అందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో పాఠశాల స్థాయి నుంచే విద్య భారంగా మారిందని, కార్పొరేట్ శక్తులు విద్యను కేవలం లాభాపేక్ష వ్యాపారంగా మార్చేశాయని మండిపడ్డారు. ఒకటో తరగతికే రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోందని మధ్యతరగతి కుటుంబాలు ఎలా భరిస్తాయని ఆయన ప్రశ్నించారు. సామాన్యులకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా విద్యా సంస్కరణలు తీసుకురావడమే తమ పార్టీ ప్రధాన ధ్యేయమని తెలిపారు.
ప్రెజర్ గ్రూప్‌గానే ఉంటాం
సీజేపీ త్వరలో ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు వస్తున్న ఊహాగానాలను దీప్కే తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆ ఆలోచన లేదని, ప్రజల తరఫున ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రెజర్ గ్రూప్‌గానే సీజేపీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలను సమీకరించి విధానపరమైన మార్పుల కోసం ఉద్యమించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తమ ప్రచారంలో పాల్గొనాలనుకునేవారు అధికారిక క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయాలని, సభ్యత్వం పూర్తిగా ఉచితమని వెల్లడించారు. ఆ క్యూఆర్ కోడ్‌లను దీప్కే మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
Also Read : బయో గ్యాస్ పంపిణీకి కొత్త పథకం.. కేంద్రం ఆమోదం
Follow Us On : WhatsApp

