తదుపరి వేటు ఎవరిపై.. ఆ ఎమ్మెల్యేల్లో టెన్షన్!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు (MLA Disqualification) వేయడంతో.. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల్లోనూ ఆందోళన నెలకొన్నట్లు తెలుస్తున్నది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా గెలిచిన దానం నాగేందర్‌ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనాపూర్‌), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కాలె యాదయ్య (చేవెళ్ల), పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ), డాక్టర్‌ సంజయ్ కుమార్‌ (జగిత్యాల), గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్ చెరు), టి. ప్రకాశ్ గౌడ్‌ (రాజేంద్రనగర్‌), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)పై పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి.

దానంపై తీర్పుతో మారిన పరిణామాలు

ఈ అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్‌ కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ.. బీఆర్‌ఎస్‌ నేతలు, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో దానం నాగేందర్‌ వ్యవహారంపై హైకోర్టు తాజాగా తీర్పు ఇవ్వడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దానం నాగేందర్‌ 2023లో బీఆర్‌ఎస్‌ తరఫున ఖైరతాబాద్‌ నుంచి గెలిచారు. అనంతరం కాంగ్రెస్ లో చేరడంతో పాటు.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానం కేసులో హైకోర్టు తీర్పు రావడం.. ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన ఎమ్మెల్యేల కేసులపై ఆసక్తిని మరింత పెంచింది.

9 మందిలో గుబులు ఎందుకు?

దానం నాగేందర్‌ కేసులో హైకోర్టు తీసుకున్న నిర్ణయం మిగిలిన కేసులకు ఆటోమేటిక్‌గా వర్తించదు. ప్రతి పిటిషన్‌లోని వాస్తవాలు, ఆధారాలు, స్పీకర్‌ ఇచ్చిన కారణాలను ధర్మాసనం ప్రత్యేకంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే, ఒకే తరహా పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై దాఖలైన పిటిషన్లు పెండింగ్లో ఉండటంతో.. దానం కేసు తీర్పు మిగిలిన కేసుల విచారణలో కీలకంగా మారే అవకాశం ఉందన్న చర్చ న్యాయ, రాజకీయ వర్గాల్లో కొనసాగుతున్నది. దీంతో తమపై కూడా అనర్హత వేటు పడుతుందా? అసెంబ్లీ సభ్యత్వం కొనసాగుతుందా? అన్న ఉత్కంఠ ఆయా ఎమ్మెల్యేల్లో నెలకొన్నట్లు తెలుస్తున్నది.

నెక్స్ట్ కడియం శ్రీహరి..?

మిగిలిన కేసుల్లో స్టేషన్ ఘనాపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారం కూడా కీలకంగా మారింది. 2023లో బీఆర్‌ఎస్‌ బీ-ఫామ్‌పై గెలిచిన ఆయన.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన తన కుమార్తె కడియం కావ్యకు మద్దతుగా ప్రపోజల్‌ సంతకం చేశారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో, కోర్టు పిటిషన్లలో ఆరోపించారు.

కావ్య నామినేషన్‌ పత్రాల్లో ప్రపోజల్గా సంతకం చేయడం, కాంగ్రెస్‌ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం, కాంగ్రెస్‌ నాయకులను కలిసిన సందర్భాల్లో ఆ పార్టీ కండువా ధరించడం వంటి ఆధారాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్యలను పార్టీ ఫిరాయింపుగా పరిగణించి అనర్హత వేటు వేయాలని కోరారు.

న్యాయపోరాటం కీలక దశలోకి..

ఒక్కో ఎమ్మెల్యేపై ఉన్న ఆరోపణలు, వారి చర్యలకు సంబంధించిన ఆధారాలు, స్పీకర్‌ ఇచ్చిన నిర్ణయాల కారణాలు వేర్వేరుగా ఉండటంతో.. ప్రతి కేసులోనూ హైకోర్టు ప్రత్యేకంగా విచారణ జరపాల్సి ఉంటుంది. దానం కేసు తీర్పు మిగిలిన తొమ్మిది మందికి నేరుగా వర్తించకపోయినా.. వారి కేసుల విచారణలో ఎలాంటి ప్రభావం చూపుతుంది? కోర్టు ముందు ఉన్న ఆధారాలు, వాదనలపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

ఒకవైపు తమ ఎమ్మెల్యే పదవుల భవితవ్యంపై ఆయా నేతల్లో ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు ఈ కేసుల తీర్పులు రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న దానిపైనా ఆసక్తి నెలకొన్నది. దీంతో మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల కేసుల్లో హైకోర్టు తదుపరి విచారణలు, వెలువరించే నిర్ణయాలపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>