కేంద్ర‌మే దళిత క్రైస్తవుల తరఫున అప్పీల్‌కు వెళ్లాలి: కేవీపీఎస్ నేత సురేష్‌

కలం, కరీంనగర్ బ్యూరో: మతం మారిన దళితులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా దక్కదని, మత మార్పిడి జరిగిన క్షణం నుంచే ఎస్సీ హోదా, తత్సంబంధిత రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణలు పూర్తిగా రద్దవుతాయన్న‌ సుప్రీం కోర్టు తీర్పు పై కేంద్ర ప్రభుత్వం పుల్ బెంచ్‌ అప్పీల్‌కు వెళ్లాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ (Thipparapu Suresh) అన్నారు. భగత్ నగర్ లోని మెడికల్ రిప్ భవనంలో దళిత క్రిస్టియన్ల ఎస్సీ హోదా రద్దు రాజ్యాంగబద్ధ‌మేనా? అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కొలపురి ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలన్నారు. 2026 మార్చి 24న దళితులు క్రైస్తవాన్ని స్వీకరిస్తే రాజ్యాంగపరమైన హక్కులు ఎస్సీ హోదా రద్దవుతుందన్న‌ సుప్రీంకోర్టు 33 పేజీల తీర్పు కోట్లాది మంది దళితుల గుండెపై దాడి చేసింద‌ని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15,25లను హత్య చేసిందన్నారు.

బౌద్ధం, సిక్కు, మతాల్లోకి వెళ్తే.. రాజ్యాంగ హక్కులు యధావిధిగా ఉన్నప్పుడు కేవలం క్రైస్తవంలోకి వెళితే మాత్రమే రాజ్యాంగ హక్కులు చట్టాలు, రిజర్వేషన్లు ఎందుకు లేకుండా పోతాయని ప్ర‌శ్నించారు. ఈ తీర్పుపై కేంద్రం సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ కు వెళ్లి రాజ్యాంగ హక్కులు దళిత క్రైస్తవులకు వర్తింపచేయాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి కాకుండా మత విశ్వాసాల ఆధారంగా వెలువడింద‌ని, సామాజిక న్యాయం రాజ్యాంగ లక్ష్యాల మీద దాడి చేసిందని పేర్కొన్నారు. కులం పుట్టుకతో వస్తుందని, తను నచ్చిన మతాన్ని స్వీకరించటం విశ్వాసాలు నమ్మకాల ఆధారంగా వస్తుంద‌ని చెప్పారు. మతం ఆధ్యాత్మిక విశ్వాస‌మైతే కులం సామాజిక వంశపారంపర్యంగా కొనసాగుతున్న ఒక అవిభాజ్యమైన ప్రక్రియ అన్నారు. క్రైస్తవంలోకి వెళ్లిన వారిలో దళితులు మాత్రమే కుల వివక్ష, అంటరానితనానికి ఎందుకు గురవుతున్నారో చెప్పాలని ప్ర‌శ్నించారు. దళిత పాస్టర్లే ఎందుకు దౌర్జన్యాలకు, దాడులకు, హత్యలకు గురవుతున్నార‌న్నారు. క్రైస్తవం పుచ్చుకున్నంత మాత్రాన కులవివక్ష అంటరానితనం పొవట్లేదని రుజువులు ఉన్నాయన్నారు.

ఒకవేళ అదే అయితే 1985లో కారంచేడులో దళితులను హత్య చేసిన సంగతి ఏమిటి? వారందరూ దళితులు క్రైస్తవులు కూడా అయినప్పటికీ మతం పేరుతో దాడి జరగలేద‌ని, కులం పేరుతోనే జరిగింద‌ని గుర్తు చేశారు.1991లో చుండూరులో జరిగిన హత్యలో వారందరూ సైతం దళితులేన‌న్నారు. మత విశ్వాసాల ఆధారంగా కాకుండా తాను పుట్టిన కులం ఆధారంగా వివక్షను దాడులను అత్యాచారాలను హత్యలను ఎదుర్కొంటున్న పరిస్థితి కొనసాగుతుందన్నారు అగ్రకులాల్లో పుట్టి క్రైస్తవాన్ని పుచ్చుకున్న వారు తమ సామాజిక హోదాగా ఉన్నత కులం ఆధారంగానే గౌరవించబడుతున్నారని మతం మారినప్పటికీ చర్చిలు కూడా కులాల వారీగా ఉంటున్నాయని చర్చిలలో కూడా స్వకుల వివాహాలు జరుగుతున్నాయని చెప్పారు. దళితులు 15 శాతం రిజర్వేషన్ పొందుతున్న వారు దళితులు క్రైస్తవం పుచ్చుకుంటే 1శాతానికి వారి రిజర్వేషన్ కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మతంలో గుడిలోకి రానివ్వ‌క‌పోయినా, బడిలో చదువుకోనివ్వ‌క‌పోయినా, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్, క్రిస్టియన్ మిషనరీస్ హాస్పిటల్, చర్చిలు సంపూర్ణంగా దళితుల్ని చేరదీశాయని చెప్పారు. బీసీలు 27 శాతం రిజర్వేషన్ ఓసీలు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుతున్నార‌ని చెప్పారు. క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తే ఆ రిజర్వేషన్ నుండి వాళ్లు దూరం కావట్లేదన్నారు. కానీ దళితులు మాత్రమే క్రైస్తవంలోకి వెళితే ఆ రిజర్వేషన్ వాళ్ళు కోల్పోవాల్సి రావడం ఏమిటని ప్ర‌శ్నించారు.

ఇక్కడ గుడిలోకి రానివ్వర‌ని, అక్కడ చర్చిలోకి పోనివ్వర‌ని, మ‌రి దళితుల బ‌తుకులకు భరోసా ఎలా అని ప్ర‌శ్నించారు. బ్రదర్ అనిల్ కుమార్, బ్రదర్ సతీష్ కుమార్‌లు లక్షలాది మందితో సభలు నిర్వహిస్తున్నార‌ని,. వారిపై ఏ రకమైన దాడులు, దౌర్జన్యాలు జరగలేద‌ని స్ప‌ష్టం చేశారు. కేవలం గ్రామ సీమల్లో దళిత పాస్టర్లుగా ఉన్న వారి పైన మాత్రం దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని, అంటే కులం కారణం కాదా? అని ప్ర‌శ్నించారు. కేంద్ర బీజేపీ సర్కార్ 12 ఏళ్ల పరిపాలన కాలంలోనే దళితులపై దాడులు దౌర్జన్యాలు 300 రెట్లు పెరిగాయన్నారు కేంద్ర ప్రభుత్వ అడ్డదండలతోనే ఈ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. బీజేపీ మతోన్మాద విధానాలపై పోరాటం చేయకుండా దళితుల హక్కులు రక్షించుకోలేమని చెప్పారు. 2018లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చడానికి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో ప్రతి పౌరుడు ఐక్యంగా ఉద్యమించిన ఫలితంగా ఆ తీర్పు వెనక్కి తీసుకోబడిందన్నారు. అదే స్ఫూర్తితో 2026 మార్చి 24న వచ్చిన తీర్పును వెనక్కి తీసుకునే అంతవరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ జేఏసీ మాజీ అధ్యక్షుడు బొంత వెంకట మల్లయ్య, రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శివరాజ్, నాయకులు అక్షిత్, కండె రాజు, విజయ, మల్లేష్, రమేష్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>