కలం, ఖమ్మం బ్యూరో: పల్లెల సమగ్ర ప్రగతి, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) అన్నారు. బుధవారం సుజాతనగర్, చుంచుపల్లి మండలాల్లో సుమారు రూ.97 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వివిధ అభివృద్ధి భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ఆయన ఘనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
సుజాతనగర్ మండల పరిధిలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన పనుల్లో భాగంగా బేతంపూడి, మాలబంజర గ్రామాల్లో రూ.20 లక్షల చొప్పున నూతన గ్రామ పంచాయతీ భవనాలను, 2 ఇంక్లైన్ పంచాయతీ పరిధిలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య (వీవో) భవనాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక సంస్థలకు సొంత భవనాలు సమకూరితేనే గ్రామీణ పరిపాలన సమర్థవంతంగా సాగుతుందని, మహిళల ఆర్థిక వికాసానికి వీవో భవనాలు వేదికలు కావాలని ఆకాంక్షించారు. మండలానికి జూనియర్ కళాశాల, ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ సాధనతో పాటు సింగభూపాలెం చెరువు అభివృద్ధి ద్వారా సాగు రంగానికి కొత్త భరోసా కల్పించామని పేర్కొన్నారు.
అలాగే, చుంచుపల్లి మండల పరిధిలో రూ.47 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. పెనగడప-అంబేద్కర్ నగర్, వెంకటేశ్వర కాలనీల్లో రూ.10 లక్షల చొప్పున వీవో భవనాలను, నందతాండాలో రూ.12 లక్షలతో పూర్తి చేసిన అంతర్గత సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం గరిమెళ్ళపాడులో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, మురుగు కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు.
బస్తీలు, కాలనీల్లో సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మాణంతో పారిశుధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ప్రజల సమస్యల పరిష్కారానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, తహసీల్దార్లు కృష్ణప్రసాద్, నాగరాజు, ఎంపీడీవో భారతి, ఎంపీవో సంధ్య, పీఆర్ డీఈ నాగేందర్, ఏఈ నవీన్ కుమార్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

