ధ‌ర్మేంద్ర‌ రాజీనామా చేయాల‌ని విదేశాల్లో నిర‌స‌న‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: నీట్‌ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న నిర‌స‌న‌లు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేస్తున్న యువ‌త కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్‌తో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయులు, విద్యార్థుల నుండి మ‌ద్ద‌తు పెరుగుతోంది. అమెరికాలోని న్యూయార్క్, శాన్‌జోస్ నగరాల్లో హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రవాసులు భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

అదేవిధంగా బ్రిటన్‌లోని లండన్, మాంచెస్టర్‌తో పాటు ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల ఎదుట విద్యార్థులు, యువ‌త‌ ప్లకార్డులు చేతబూని మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో ప్రధానంగా భారత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోకుండా విద్యావ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలని స్పష్టం చేశారు. భారత్‌లో జ‌రుగుతున్న‌ విద్యార్థుల పోరాటానికి తాము అండగా ఉంటామని, ధ‌ర్మేంద్ర‌ రాజీనామా చేసే వరకు తమ మద్దతు కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>