కలం, వెబ్ డెస్క్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రపూరితంగా తమ పార్టీ ఓటర్ల ఓట్లను తొలగించకుండా క్షేత్రస్థాయిలో జాగ్రత్త వహించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ భవన్‌లో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని శాసన నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, కంటోన్మెంట్ బోర్డ్ సభ్యులు , సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR – ఓటర్ల జాబితా సవరణ), పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై ఇన్‌ఛార్జ్‌లకు పలు కీలక దిశానిర్దేశాలు చేశారు.
ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు నమోదు కాకుండా కచ్చితమైన నిఘా ఉంచాలని సూచించారు. అర్హులైన ప్రజల ఓటు హక్కును కాపాడటంలో ప్రతి బూత్ స్థాయిలో ‘బూత్ లెవెల్ అసిస్టెంట్లు’ (BLAs) కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. పార్టీ కార్పొరేటర్ ఆశావాహులు క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్, బీజేపీ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా “కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి” అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాధారణంగా జరిగే ఈ ప్రత్యేక ఓటర్ల వడపోత కార్యక్రమంలో బీజేపీ దేశవ్యాప్తంగా అనేక వివాదాలు సృష్టించిందని చెప్పారు. తమకు వ్యతిరేకంగా ఉన్న పార్టీల ఓటర్లను, వారి మద్దతుదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో ఈఎస్ఐఆర్‌ను అడ్డగోలుగా వినియోగించడం వంటి అనేక ఆరోపణలున్నాయని చెప్పారు. తెలంగాణలో ఎస్ఐఆర్ పారదర్శకంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులను కోరారు.
తెలంగాణలో బీజేపీ లేనే లేదని.. కేవలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చిన గాలి గత్తర వల్ల కొంత కనిపిస్తుందని కొట్టిపారేశారు. బీజేపీ.. సోషల్ మీడియాలో ఎక్కువ, సొసైటీలో తక్కువ ఉన్న పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేస్తున్నది కూల్చివేతలేనని మండిపడ్డారు. నగరంలో కనీసం తాగునీటి సరఫరా, దోమల నియంత్రణ వంటి అంశాలను కూడా నిర్వహించలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదని మండిపడ్డారు..

