కలం, నల్లగొండ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపడాన్ని నిరసిస్తూ సీపీఐ ధర్నా చేపట్టింది. నల్గొండ (Nalgonda) జిల్లా సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో శనివారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను సీపీఐ శ్రేణులు దహనం చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పప్పు వీరస్వామి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పప్పు వీరస్వామి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల జేబులు ఖాళీ చేస్తూ, కార్పొరేట్ శక్తులైన అంబానీ, అదానీల జేబులు నింపుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ఇంధన ధరల పెంపు ప్రభావం రవాణా రంగంపై పడి, మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సీపీఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలతో సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేదని, తక్షణమే చమురు ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ధరలను నియంత్రించకపోతే, రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ ఆందోళనలు, రోడ్ల దిగ్బంధనాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి కె.ఎస్. రెడ్డి, ముఖ్య నాయకులు లెనిన్, యాదయ్య, ముత్యాలు, నందం, సుజాతతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

