కలం, వెబ్ డెస్క్ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టు (Kadem Project)కు వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాజెక్టులోకి 88,828 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గురువారం ప్రాజెక్టు 9 వరద గేట్లను ఎత్తి 68,519 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేశారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 693 అడుగులకు చేరింది. కొద్ది రోజులుగా బోసిపోయి కనిపించిన గోదావరి నది ఇప్పుడు వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. వరద పరిస్థితులను పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల కడెం ప్రాజెక్టును సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇరిగేషన్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రాజెక్టు గేట్లను చూసేందుకు సందర్శకులు వచ్చే అవకాశముండటంతో ప్రాజెక్టు పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, వాగులు, వంకలు, ప్రాజెక్టుల సమీప ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రాజెక్టుల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

