కలం, వెబ్ డెస్క్ : జిల్లాల పునర్విభజన పేరుతో కొత్త జిల్లాలను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. శనివారం ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పాలమూరు జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ పరిపాలన వికేంద్రీకరణ దృక్పథంతో పాలమూరును అనేక జిల్లాలుగా మార్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ పాలమూరు జిల్లా బిడ్డను అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ఆ ఉమ్మడి జిల్లాపై కుట్రతో జిల్లాలను రద్దు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు, నల్గొండ జిల్లాలకు సంబంధించిన అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల్లో జరుగుతున్న ఆలస్యం, కృష్ణా జలాల వాటా వంటి కీలక అంశాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పార్టీ నేతలకు కేటీఆర్ సూచించారు. రెండు అంశాలపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మరోవైపు రానున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రతి మున్సిపాలిటీ వారీగా ప్రత్యేక కార్యాచరణతో, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమిష్టిగా ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం వైఫల్యాన్ని, మోసాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలోనూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులను కాంగ్రెస్ నిలిపివేసిందని మండిపడ్డారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ ఎన్నికల స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని KTR సూచించారు.


