కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లాలోని సీఎంఆర్ ధాన్యం స్కామ్ (Paddy Scam) రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా రూ.191 కోట్ల కుంభకోణానికి పాల్పడిన అక్రమార్కుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఏడుగురు అక్రమార్కుల జేబుల్లోకి ప్రజాధనం వెళ్ళిపోయింది. జిల్లా యంత్రాంగం కండ్ల ముందే భారీ పెద్ద స్కామ్ జరిగినా.. కేసులు నమోదైనా.. నిందితులు మాత్రం దర్జాగా పరారీలో ఉంటూ హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడు రైస్ మిల్లులపై కేసులు నమోదై నెలలు గడుస్తున్నా.. కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్టు చేయడం పోలీసు యంత్రాంగంపై పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. మిగిలిన ఐదు రైసు మిల్లులకు చెందిన బాధ్యులు మాత్రం దొరక్కపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సామాన్యుడిపై ప్రతాపం చూపే చట్టం రూ.కోట్లు కొల్లగొట్టిన తిమింగలాల ముందు ఎందుకు తోక ముడుస్తోంది? నల్లగొండ బియ్యం స్కామ్ వెనుక అసలు సూత్రధారులెవ్వరు? ఇందులో అధికారుల ప్రమేయం లేదా? ఉంటే వారిపైనే చర్యలేవీ? అక్రమార్కులకు అండగా నిలిచే పొలిటికల్ లీడర్ల సంగతేంటి? ప్రస్తుతం సగటు నల్లగొండ జిల్లా వాసుడి మనస్సును తొలుస్తోన్న ప్రశ్నలివి. ఈ కేసు నుంచి బయటపడేందుకు నిందితులు ఓ పొలిటికల్ లీడర్‌తో భారీ డీల్ చేసుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
అధికారుల ప్రమేయం..
పరారీలో ఉన్న ఐదుగురు మిల్లర్లు తమపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ గురువారం బెంచ్ ముందుకు రానుంది. కోర్టు నుండి స్టే తెచ్చుకుని, కేసు నుండి బయటపడాలని మిల్లర్లు తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మిల్లర్ల వెనుక పొలిటికల్ పెద్దల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు అధికారుల సహకారం ఉండడంతో సీఎంఆర్ కేసు మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. ఈ భారీ కుంభకోణం వెనుక సివిల్ సప్లై శాఖలోని కొందరు కీలక అధికారులు, అధికార పార్టీకి చెందిన కీలక నేతల హస్తం ఉందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సీఎంఆర్ ధాన్యానికి సంబంధించిన నిధుల మళ్లింపులో అధికారుల సంతకాలు, రాజకీయ నేతల సిఫార్సులు లేకుండా ఇంత పెద్ద మొత్తం మాయం కావడం అసాధ్యమని సొంత శాఖ అధికారుల చెబుతుండడం గమనార్హం. పరారీలో ఉన్న మిల్లర్లకు రాజకీయ నేతలే ఆశ్రయం కల్పిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
ఈ మిల్లుల్లోనే రూ.191 కోట్ల స్కామ్..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2022-23 సంవత్సరానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ మిల్లర్లకు భారీగా ధాన్యం కేటాయించింది. అయితే అందులో చిట్యాల వరలక్ష్మి పారాబాయిల్డ్, కేతేపల్లి చాముండేశ్వరి, మునుగోడు మురళీ మనోహర్, నల్లగొండలోని రామలక్ష్మణ్, కనక మహాలక్ష్మి, సుమాంజలి, గౌతమి ఇండస్ట్రీస్ సైతం సీఎంఆర్‌గా మార్చి ఇస్తామని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకున్నాయి. కానీ తిరిగి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం మాత్రం పత్తాకు లేవు. దాదాపు ఏడు మిల్లుల్లో మొత్తం 58,955 మెట్రిక్ టన్నుల ధాన్యం తిరిగివ్వలేదు. ఆ ధాన్యం విలువ అక్షరాల రూ. 193 కోట్లకు పైమాటే. అయితే ఏడాది క్రితం ప్రభుత్వం ఈ ధాన్యాన్ని వేలం వేస్తే.. కొనుగోలుదారులు వెళ్ళి చూస్తే మిల్లుల్లో ధాన్యం మాయమయ్యింది. దీంతో అసలు విషయం బట్టబయలయ్యింది. రైస్ మిల్లర్లు నేరుగా ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మర పట్టించి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా నేరుగా కాకినాడ పోర్టుకు తరలించి అమ్ముకున్నారని అధికారుల ధ్రువీకరణలో తేలింది.
రికవరీ యాక్ట్ అమలు చేయకుండా జాప్యం
సివిల్ సప్లై శాఖ నిబంధనల ప్రకారం.. మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి సేకరించాల్సిన పూర్తి బాధ్యత సివిల్ సప్లై కార్పొరేషన్‌తో పాటు జిల్లా అధికార యంత్రాంగానిది. జిల్లా అదనపు కలెక్టర్ ఈ సీఎంఆర్ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీరికితోడు జిల్లా సివిల్ సప్లై శాఖ ఉండనే ఉంది. వాస్తవానికి మిల్లర్లు ధాన్యం అప్పగించడంలో విఫలమైతే.. ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ప్రయోగించి వారి ఆస్తులను జప్తు చేసే అధికారం కలిగి ఉంది. కానీ ఈ రికవరీ యాక్ట్‌ను అమలు చేసేందుకు అధికారులు మీన మేషాలు లెక్కిస్తుంటారు. అందుకు ప్రధాన కారణం మిల్లర్ల నుంచి అందే ముడుపులే.
అధికారుల ఉదాసీనతే కారణమా?
సీఎంఆర్ అలాట్ చేసిన ప్రతి మిల్లుల్లో స్టాక్ ఎంతుందో ప్రతి నెల తనిఖీ చేయాలి. కానీ అధికారుల ఉదాసీనత వల్ల మిల్లుల్లో ధాన్యం లేకపోయినా ఉన్నట్లుగా లెక్కలు చూపడం వల్లే ఇలాంటి స్కామ్‌లు జరుగుతున్నాయి. కొంతమంది అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై.. ధాన్యాన్ని ప్రైవేటు మార్కెట్లోకి తరలించి అమ్మి సొమ్ము చేసుకునేందుకు గేట్లు బార్లా తెరిచేస్తున్నారు. మిల్లర్ల నుంచి తీసుకోవాల్సిన బ్యాంక్ గ్యారెంటీలను సక్రమంగా తీసుకోకపోవడమూ ఈ స్కామ్‌లకు కారణమే చెప్పాలి. మరోవైపు మిల్లర్లు ఒక ఏడాదికి సంబంధించి అలాట్ చేసిన సీఎంఆర్ బియ్యం ఇవ్వకపోతే వారిని డిఫాల్టర్ల జాబితాలో చేర్చాలి. కానీ అధికారులు మాత్రం సీఎంఆర్ గడువు పొడగించుకుంటూ పోతున్నారు. ఇప్పటికైనా సీఎంఆర్ విషయంలో జిల్లా యంత్రాంగం తన వైఖరిని మార్చుకుంటుందా? లేక షరా మాములుగానే తిలా పాపం.. తలా పిడికేడు అన్న చందంగా వ్యవహరిస్తుందా? అన్నది వేచి చూడాలి.

