Mobile Popup Ad
Mobile Popup Ad

ఫ్యూచర్ సిటీ కాదు.. ఉన్న సిటీని చూడు: రేవంత్‌కు కేటీఆర్ కౌంటర్

కలం, వెబ్‌ డెస్క్‌ : తెలంగాణలో ఎన్నికల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో పడేయడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పార్లమెంట్‌లో బీఆర్ఎస్ లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటును అవమానించేలా బీజేపీ ఎంపీ మాట్లాడినా, ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోయారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా ఫ్యూచర్ సిటీ అంటూ గొప్పలు చెబుతున్నారని, కానీ ప్రస్తుతం ఉన్న నగరంలోనే కనీస సౌకర్యాలు కల్పించే దిక్కులేదని కేటీఆర్ (KTR) విమర్శించారు. ఇక్కడి సమస్యలు తీర్చలేని నాయకుడు ఫ్యూచర్ సిటీని ఏం నిర్మిస్తాడని ప్రశ్నించారు. మూసీ నది ప్రక్షాళన (Musi Rejuvenation) తామేదో కొత్తగా చేస్తున్నట్లు రేవంత్ మాట్లాడుతున్నారని, అసలు బీఆర్ఎస్ హయాంలోనే మూసీ ప్రక్షాళన పనులు మొదలయ్యాయని గుర్తుచేశారు. అందులో భాగంగానే అనేక ప్రాంతాల్లో ఎస్‌టీపీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

వ్యవసాయ మోటార్లకు, ట్రాన్స్‌ఫార్మర్‌లకు మీటర్లు పెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంత ఒత్తిడి తెచ్చినా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం మీటర్లు పెట్టడానికి అస్సలు ఒప్పుకోలేదన్నారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తనపై ఉన్న కేసుల భయంతో మోదీ తానా అంటే తందాన అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వ ఫ్యూజులు పీకాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.

రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) పూర్తిగా సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కేవలం గెలిచే గుర్రాలకే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. పార్టీ నాయకుల చుట్టూ తిరిగే వారికి కాకుండా, ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల కోసం పోరాడే నాయకులకే ఈసారి టికెట్లు దక్కుతాయని ఆయన తేల్చిచెప్పారు.

Read Also: రూ.500 పెన్ష‌న్ కోసం అత్త‌ను భుజాల‌పై మోస్తూ 5 కి.మీ ప్ర‌యాణం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>