కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని సర్గూజా జిల్లాలో హృదయ విదారకమైన ఘటన వెలుగు చూసింది. కేవలం రూ.500 పెన్షన్ కోసం ఓ కోడలు తన 90 ఏళ్ల అత్తను భుజాలపై మోసుకుంటూ 5 కిలో మీటర్ల దూరం కాలినడకన బ్యాంకుకు తీసుకెళ్లింది. ఈ ఘటన మెయిన్ పాట్ బ్లాక్ పరిధిలోని కునియా జంగల్‌పారాలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ సుఖ్ మనియా తన అత్త సోన్ వారీని మోసుకుంటూ బ్యాంకుకు తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుఖ్మనియా ఇల్లు ఉన్న ప్రాంతానికి కిలో మీటరు దూరంలో వాగు ఉంది. దీంతో అక్కడి వరకు ఎలాగూ వాహన సదుపాయం లేదు. ఇంటి నుంచి వాగు వరకు వచ్చి వాగు దాటుకొని బ్యాంకు వరకు ఇలాగే అత్తను మోసుకుంటూ వెళ్తుంది. తీవ్ర పేదరికంతో ఉన్న సుఖ్ మనియాకు ఎవరూ ఆర్థిక సాయం కూడా చేయలేదు. దీంతో తరచూ ఇలాగే అత్తను మోసుకుంటూ బ్యాంకుకు తీసుకొస్తున్నట్లు కన్నీటి పర్యంతమైంది.
గతంలో బ్యాంక్ మిత్ర నేరుగా ఇంటికే వచ్చి పెన్షన్ ఇచ్చే వాడని, కొన్ని నెలలుగా అతడు రావడం మానేశాడని సుఖ్మనియా తెలిపింది. దీనికి తోడు బ్యాంకు కేవైసీ పూర్తి కాకపోవడంతో గత మూడు నెలలుగా పెన్షన్ డబ్బులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తప్పని పరిస్థితుల్లో తన అత్తను వీపుపై మోసుకొని 5 కిలో మీటర్ల దూరం ప్రయాణించి సెంట్రల్ బ్యాంకుకు చేరుకుంది. బ్యాంకు అధికారులు ఆమె ఖాతాలో ఉన్న రూ.2000 నుంచి నిలిచిపోయిన మొత్తం పెన్షన్ రూ.1500లను అందజేశారు. వృద్ధురాలైన సోన్‌వారీకి కేవలం వృద్ధాప్య పెన్షన్ మాత్రమే అందుతుందని, ఇతర పథకాలు అందడం లేదని కోడలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్థానిక ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పెన్షన్లు ఇస్తున్నామని గొప్పగా చెప్పుకునే పాలకులకు వృద్ధుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ చెప్పిన వికాస్ ఇదేనా? అంటూ విమర్శలు చేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు, పెన్షన్ పథకాలు అమలైన తర్వాత కూడా ఈ కాలంలో ఓ వృద్ధురాలు ఇంత కష్టం ఎదుర్కోవడం దారుణమంటూ కామెంట్ చేస్తున్నారు.

