కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్టు కోటి సాక్ష్యాలున్నా చర్యలు మాత్రం సున్నా అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). ఈ రోజు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్యలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ (Gaddam Prasad) క్లీన్ చీట్ ఇవ్వడంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ.. ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారంటూ మండిపడ్డారు. కండ్ల ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా సరే.. ఆధారాలు లేవంటూ మాట్లాడటం కాంగ్రెస్ వైఖరిని బయటపెడుతోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడిన అప్రజాస్వామిక శక్తులే నేడు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్యలను కాపాడాయంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి శాసనసభ వ్యవస్థలు, ఉన్నత న్యాయస్థానాలు అంటే గౌరవం లేదని నిరూపించుకుందని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత శాసనసభ స్పీకర్ వేయకపోయినా.. కోర్టులో వారు ఎన్నడో ‘మాజీ‘ అయిపోయారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలమైన దెబ్బ పడిందని.. అందుకే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వెళ్లడానికి ఆ పార్టీ భయపడుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే దాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ (KTR) చెప్పుకొచ్చారు.
Read Also: మధిరకు వరద నుంచి విముక్తి: భట్టి విక్రమార్క
Follow Us On : WhatsApp


