Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‌లో 24 గంటల తాగునీటి సరఫరా చేస్తాం: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి 24 గంటల తాగునీటి సరఫరా అందిస్తామని హామీ ఇచ్చారు. కూకట్‌పల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓట్ల సవరణ కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోత, నీటి కోత తీవ్రంగా ఉండేదని, పట్టుదలతో 24 గంటల నిరంతర కరెంట్‌ను కేసీఆర్ రాష్ట్రానికి అందించారని గుర్తుచేశారు.

ప్రతి వర్గాన్ని మోసం చేసిన కాంగ్రెస్..

తెలంగాణలో 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కనీసం కరెంట్ సరఫరా నీటి సరఫరా చేయలేని దుస్థితి ఉండేదని కేటీఆర్ అన్నారు. నీటి కోసం, కరెంటు కోసం ధర్నాలు జరిగేవని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక 24 గంటల కరెంట్ తో పాటు ప్రతి ఇంటికి పైప్‌లైన్‌తో మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రతి వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. పెన్షన్ల నుంచి మొదలుకొని మహిళలకు రూ. 2,500 వరకు ప్రతి ఒక్క వర్గానికి హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పారు.

ఒక్క ఇల్లు నిర్మించినా రాజకీయ సన్యాసం చేస్తా..

హైదరాబాద్ నగరానికి రెండున్నరేండ్ల పరిపాలనలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించలేదని.. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినా రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనపై అవగాహనతోనే హైదరాబాద్ నగర ప్రజలు ఒక్క సీటు ఇవ్వలేదని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూకట్‌పల్లిలో ఒక్క ఇల్లు అయినా కట్టారా? అనిప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యమని.. హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యమని ఫైర్ అయ్యారు.

ఈసారి కార్యకర్తకు తగిన గౌరవం..

గతంలో తాము కేవలం అభివృద్ధిపైన మాత్రమే దృష్టి పెట్టామని.. కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి అండగా ఉన్న కార్యకర్తకు, నాయకుడికి ప్రతి ఒక్కరికి తగిన అవకాశం గౌరవం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నమోదు చేసిన దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏ ఒక్కరు ఓటు కోల్పోకుండా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. ఈసారి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ రూపంలోనే ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమం, కమిటీల ఏర్పాటు దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>