కలం, తెలంగాణ బ్యూరో: BRS GHMC Battle | అసెంబ్లీ ఎన్నికల నుంచి వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న బీఆర్ఎస్‌కు ఇప్పుడు ఉనికి కీలకంగా మారింది. క్షేత్రస్థాయిలో కేడర్ డీమోరల్ అయ్యారనే నిర్ధారణకు వచ్చింది. కేసీఆర్ (KCR) జగిత్యాల సభలో జోష్ నింపే ప్రయత్నం చేసినా రెస్పాన్స్ ఆశించినంతగా రాలేదనే అభిప్రాయం నెలకొన్నది. దీంతో ప్రజాందోళనతో పబ్లిక్‌లో ఉండాలని నిర్ణయించుకున్నది. వడ్ల కొనుగోళ్ళు అంశంతో రైతుల్లో, తాగునీటి సరఫరా విషయంలో ప్రజలతో కలిసి పోరాటాలకు శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వ్యతిరేకత స్థాయికి తీసుకెళ్ళాలని భావిస్తున్నది. సంక్షేమ పథకాల్లోని లోపాలు, మంత్రుల్లో అవినీతి.. ఇలాంటివాటిని పదేపదే ప్రస్తావిస్తూ ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల గడువు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ తరహాలో పొలిటికల్ హీట్ పెంచింది. ఈసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదేనంటూ మైండ్ గేమ్ మొదలుపెట్టింది.
కీలకంగా జీహెచ్ఎంసీ ఎన్నికల రిజల్ట్ :
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు (GHMC Elections) ఎప్పుడొస్తాయో తెలియదుగానీ అధికార పార్టీకంటే ముందుగానే విపక్షాలు హుషారయ్యాయి. బీజేపీ చాలాకాలం కిందటే కేడర్‌కు సూచనలు చేసింది. ఆ విషయాన్ని పసిగట్టిన బీఆర్ఎస్ దూకుడుగా లేకుంటే ఇజ్జత్ పోతుందనే ఆందోళనలో పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన సీట్లలో దాదాపు మూడింట ఒక వంతు జీహెచ్ఎంసీ నుంచే వచ్చాయి. కానీ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉన్నారు. ఇందులో సగం మంది జీహెచ్ఎంసీకి చెందినవారే. దీంతో ఆ ప్రభావం కార్పొరేటర్ల మొదలు కేడర్ వరకు ఉంటుందని భావించిన గులాబీ లీడర్లు అప్రమత్తమయ్యారు. గ్రౌండ్‌ను పదిలం చేసుకోకుంటే మరో చేదు అనుభవం తప్పదని, ఇది అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుందని భయపడుతున్నది. అందులో భాగమే హైదరాబాద్, సికింద్రబాద్ పార్లమెంటు నియోజకవర్గాలు సహా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో వరుస రివ్యూ మీటింగులు పెట్టి లీడర్లను, కేడర్‌ను అలర్ట్ చేస్తున్నది. ఇక్కడ రిజల్టు ప్రతికూలంగా వస్తే ఆ పార్టీ భవిష్యత్ అంచనాలన్నీ తలకిందులయ్యే ప్రమాదం లేకపోలేదు.
ఈసారి ఎన్నికల్లో పోటీ తీవ్రం :
జీహెచ్ఎంసీకి జరిగే ఎన్నికలు ఈసారి డిఫరెంట్‌గా ఉండబోతున్నాయి. ఉమ్మడి జీహెచ్ఎంసీకి జరుగుతుందా?.. లేక మూడు మునిసిపల్ కార్పొరేషన్లకు విడివిడిగా జరుగుతాయా?.. ఎలా జరిగినా గెలుపుపైనే అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఫోకస్ పెట్టాయి. ఈ ఎన్నికలపై కాంగ్రెస్‌కు పెద్దగా ఆందోళన లేనప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకింత టెన్షన్‌లోనే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ నామమాత్రంగానే పోటీ ఇచ్చింది. ప్రధాని పోటీ బీజేపీ, బీఆర్ఎస్ (BRS GHMC Battle) మధ్యనే నడిచింది. పాతబస్తీలో మజ్లిస్ ప్రభావం సరేసరి. కానీ ఈసారి మాత్రం కాంగ్రెస్ పవర్‌లో ఉన్నందున మూడు పార్టీల మధ్య పోరు అనివార్యంగా కనిపిస్తున్నది. దీనికి తోడు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడంతో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీలో ఉండి దీటుగా నిలబడాలని భావిస్తున్నది. గ్రేటర్‌లో పట్టు ఉన్నదని బీఆర్ఎస్‌లో ధీమా ఎలా ఉన్నా జీహెచ్ఎంసీలో ఓడితే అది మొత్తం పార్టీ భవిష్యత్తుకే ప్రమాదంగా మారుతుందనే టెన్షన్ పట్టుకున్నది. అందుకే వరుస రివ్యూ మీటింగులు.
మూసీ, ఫ్యూచర్ సిటీ, హైడ్రా అంశాలు.. :
గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఈసారి ఎదురయ్యే పోటీ బీఆర్ఎస్‌కు సవాలుగా మారింది. హైడ్రాను రద్దు చేస్తామంటూ జగిత్యాల సభలో కేసీఆర్ ప్రకటించారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ హరీశ్‌రావు అమెరికా వేదికగా ప్రకటించారు. మూసీ పునరుజ్జీవంతో (Musi Rejuvenation) పేదల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మూడు ప్రాజెక్టూ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోనివే కావడంతో వీటిని బీఆర్ఎస్ టేకప్ చేస్తున్నది. ప్రజల్లో వీటికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ఉధృతం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇవి ప్రచారాస్త్రాలుగా ఉపయోగపడతాయన్నది ఆ పార్టీ భావన. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కాంగ్రెస్ వ్యతిరేకతపైనే ఆధారపడుతున్నాయి. దీనికి తోడు కవిత కూడా కొత్త పార్టీతో తొలి ప్రయోజనాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారానే పొందాలనుకుంటున్నారు. అర్బన్‌లో ఉన్న సంప్రదాయ టర్లకు తోడు తాజా మోదీ సభతో పార్టీకి మరింత ఇమేజ్ పెరిగిందని బీజేపీ భావిస్తున్నది. సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం కోసం అనుసరించిన ఫార్ములానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అవలంబించాలనుకుంటున్నది.
Read Also: ఏసీబీ దూకుడు.. కటకటాల్లోకి కరప్షన్ కింగ్స్!
Read Also: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గబోతున్నాయా? కేంద్రం కీలక నిర్ణయం

