కలం, వెబ్ డెస్క్ : పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల (YS Sharmila) ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రజలను లూటీ చేయడంలో మోదీని మించినోళ్లు లేరని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలను వారంలో 4 సార్లు పెంచడం అత్యంత దారుణమన్నారు. ప్రజలపై రోజుకు వెయ్యి కోట్ల రూపాయల అదనపు భారం మోపుతున్నా మోదీ ఆకలి తీరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల సంపాదనను కాజేసి వారిని రోడ్డున పడేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇంధన సంక్షోభం వేళ సుంకాలు తగ్గించాల్సిందిపోయి, అదనంగా భారం వేయడం మోదీకే చెల్లిందని షర్మిల విమర్శించారు.
మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హయాంలో ఇంధన ధరలపెంపు భారం వేయకుండా తీసుకున్న నిర్ణయాలు ప్రపంచానికి పాఠాలు నేర్పాయన్నారు. కానీ, నేడు నష్టాల పేరుతో ప్రజలపైనే పూర్తి భారం వేస్తున్నారని షర్మిల దుయ్యబట్టారు. చమురు ధరలు తగ్గినప్పుడు లాభాలు పొంది, ధరలు పెరిగితే జనాలను దోచుకోవడం మోదీ దుర్మార్గపు పాలనకు నిదర్శనమన్నారు. అలాగే, దేశంలోనే ఏపీలో ఇంధన ధరలు అధికమన్నారు. రాష్ట్ర ప్రజలపై మోదీ ప్రభుత్వం భరించరాని భారం మోపుతుంటే సీఎం చంద్రబాబు మౌనం వహించడం సిగ్గుచేటని షర్మిల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెట్రోల్ పై అధికంగా వసూలు చేస్తున్న వ్యాట్ ను, రోడ్ సెస్ ను రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

