అక్రమ మైనింగ్ చేస్తున్న పొంగులేటిపై చర్యలు తీసుకోవాలి: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్‌ను కలుస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. త్వరలో మరిన్ని కుంభకోణాలను బయటపెడతామని హాట్ కామెంట్స్ చేశారు. వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు కబ్జా చేసిన భూములను కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. ఈసందర్భంగా బాధితుడు సతీష్ షా కుటుంబంతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉందని.. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వారి పేరు మీదనే భూమి ఉందని చెప్పారు. గత 60 సంవత్సరాలుగా ఈ భూమిలో వారు నివసిస్తున్నారని అన్నారు. వట్టినాగులపల్లి గ్రామం అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ భూముల విలువలు భారీగా పెరిగాయన్నారు. సతీష్ షా కుటుంబానికి చెందిన ఈ భూమి సుమారు రూ. 1400 కోట్ల విలువ కలిగి ఉండగా, దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడిందని ఆరోపించారు.

మంత్రి పొంగులేటి (Ponguleti Srinivas Reddy), ఆయన కుమారుడు హర్షా రెడ్డి (Harsha Reddy) కలిసి స్వయంగా సతీష్ షా ఇంటికి వెళ్లి, భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సతీష్ షా కుటుంబం భూమిని డెవలప్‌మెంట్‌కు ఇవ్వడానికి గానీ, అమ్మడానికి గానీ సిద్ధంగా లేమని స్పష్టంగా చెప్పారని తెలిపారు. దీనికి తరువాత మంత్రి పొంగులేటి అరాచకాలకు తెరలేపారని మండిపడ్డారు. తన రెవెన్యూ శాఖలోని శ్రీనివాసులు అనే అధికారి ద్వారా రూ. 100 కోట్ల లంచం కేసులో పట్టుబడిన ఏడీతో దొంగ సర్వే చేయించి బాధితులను తీవ్రంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు.

భూమిని ఇవ్వకపోతే, రెవెన్యూ సర్వే పేరుతో 27 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని బెదిరించారని అన్నారు. దీనికీ లొంగకపోవడంతో హర్షా రెడ్డి, ఆయనకు చెందిన రాఘవ కన్స్‌ట్రక్షన్స్ (Raghava Constructions) గుండాలతో కలిసి, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలతో వచ్చి బాధితులు నిర్మించుకున్న గోశాలను కూల్చివేశారని తెలిపారు.

దాదాపు కిలోమీటర్ మేర ఉన్న కాంపౌండ్ వాల్‌ను కూడా ధ్వంసం చేసి, బాధితులను భయభ్రాంతులకు గురిచేశారని కేటీఆర్ (KTR) అన్నారు. ఈ ఘటన విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన సతీష్ షా, పల్లవి షా కుటుంబ సభ్యులను అక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించి, రాత్రంతా నిలబెట్టారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు వద్ద ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాష్ట్రపతి పతకం అందుకున్న నిజాయితీ గల పోలీస్ అధికారి హబీబుల్లాను బదిలీ చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి మధ్య ఉన్న వ్యాపార అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని ఈ దురాగతాలు జరుగుతున్నాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో ఉన్న 20 లక్షల ఎకరాల భూమిని కోటి ఎకరాలకు పెంచి, నిషిద్ధ జాబితా పేరుతో ప్రజలను బెదిరిస్తూ 50 శాతం భూమి వాటా డిమాండ్ చేస్తోందని చెప్పారు. ఇలాంటి అన్యాయాలకు గురైన బాధితులు ఎవరైనా ఉంటే తెలంగాణ భవన్‌కు వచ్చి వివరాలు ఇవ్వాలని, వారికి పార్టీ పరంగా, న్యాయపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్రమ మైనింగ్‌ను ప్రశ్నించిన తమ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. క్రషర్లు అక్రమంగా ఏర్పాటు చేసి మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read Also: సోషల్ మీడియా విద్వేషాలకు చెక్: తెలంగాణ సర్కార్ కీలక బిల్లు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>