కలం, వరంగల్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), తెలంగాణ పోలీసులపై రెచ్చిపోయారు. సోమవారం భూపాలపల్లిలో బీఆర్ఎస్ (BRS) పార్టీ నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులకు, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నన్ను తిట్టినా, బీఆర్ఎస్ నేతలను తిట్టినా భరిస్తాం కానీ, కేసీఆర్‌ను తిడితే ఊరుకునేది లేదన్నారు. మరో రెండేళ్లలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాతాళంలో దాగి ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం పోలీసులు గుర్తు పెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు. తమ కార్యకర్తలతో, నాయకులతో అనుచితంగా ప్రవర్తించే పోలీస్ అధికారుల తోకలు కత్తిరిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలని, అతి చేయవద్దని సూచించారు. సీఎం, ఎమ్మెల్యేల అండ చూసుకొని రెచ్చిపోవద్దన్నారు. మరోవైపు ఆదివారం హన్మకొండలో సైతం కేటీఆర్ సీఎం రేవంత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసులు, వేధింపులకు భయపడేది లేదని, ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
బూతుల సీఎంకు పోలింగ్ బూత్‌లోనే ప్రజలు బుద్ది చెప్పాలని కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. భూపాలపల్లి సింగరేణిని ఆగం చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ (Nampally FSL) ప్రమాదంలో ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను అగ్గిపెట్టి కాల్చేశారని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పథకాలు అందిన వాళ్లు వాళ్లకే ఓటు వేయండంటూ కేసీఆర్ చెప్పారు. తులం బంగారం, రూ.4,000 పెన్షన్ వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్నారు. కేసీఆర్ పథకాలు తీసుకున్న వాళ్లు బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. ఇక బీజేపీపై కేటీఆర్ సెటైర్లు వేశారు. పూజకు పనికి రాని పువ్వులు బీజేపీ నేతలన్నారు. 12 ఏళ్లలో తెలంగాణకు బీజేపీ నయా పైసా పని చేయలేదని విమర్శించారు.
Read Also: బీఆర్ఎస్ పని అయిపోయింది.. కాంగ్రెస్‌ను ఖతం చేయాలి : కిషన్‌రెడ్డి
Follow Us On: Sharechat


