కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth)కి దమ్ముంటే మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. ఈ మేరకు లోక్‌భవన్‌లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా(Shiv Pratap Shukla)తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఆయనకు ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మైనింగ్ కు సంబంధించిన విషయాలను గవర్నర్‌కు వివరించారు. మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని, పొంగులేటి అక్రమాలపైన ఇండిపెండెంట్ జ్యుడీషియల్ ఎంక్వైరీ, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన అక్రమాల పైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కూడిన సభా సంఘం వేయాలి, స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పొంగులేటి మైనింగ్ అక్రమాలు చేశారని ఆరోపిస్తూ భూకబ్జాలపైన సాక్షాదారాలను గవర్నర్‌కు అందజేశారు. రేవంత్ రెడ్డి కంటే పెద్ద బ్లాక్‌మెయిలర్ రాష్ట్రంలో ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో అచ్చంగా ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తీసుకువచ్చిందన్నారని కేటీఆర్ మండిపడ్డారు. గవర్నర్ కూడా ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ రోజుల్లో 19 నెలల పాటు జైలు అనుభవించారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఎమర్జెన్సీ నాటి అరాచక పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ‘రాఘవ కన్స్‌ట్రక్షన్స్’ అనే కంపెనీ మైనింగ్ నిబంధనలను ఉల్లంఘించి, అక్రమంగా జంట జలాశయాల పరిధిలో మైనింగ్ నిషేధం ఉన్నప్పటికీ మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు.
సంబంధం లేని భూమిని చెరబట్టి ఎలాంటి మినరల్ డీలర్ లైసెన్స్, పొల్యూషన్ బోర్డ్ అనుమతులు, విద్యుత్ కనెక్షన్లు, పరిశ్రమల శాఖ అనుమతులు లేకుండానే రెండేళ్లుగా రెవెన్యూ మంత్రి కుటుంబం వందల కోట్ల ప్రజా సంపదను కొల్లగొడుతుందని గవర్నర్ కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని సభలో లేవనెత్తితే మొత్తం ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సభ నుండి బహిష్కరించారని గవర్నర్ కు తెలిపారు. ఈ అంశం పై ఎంక్వైరీ పారదర్శకంగా జరగాలని, అందులో భాగంగా మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశామని కేటీఆర్, పార్టీ నేతలు గవర్నర్‌కు తెలియజేశారు.

