కలం, భువనగిరి: భువనగిరి (Bhongir) పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) అన్నారు. ఆదివారం పట్టణంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కోర్టు సమీపంలో వేగంగా కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులతో పాటు, ఆర్‌బీ నగర్‌లో చేపడుతున్న ఫుట్‌పాత్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు. నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులోపు అన్ని పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన రహదారులు, ఆధునిక పారిశుద్ధ్య సౌకర్యాలు, సురక్షితమైన నడక మార్గాలను అందుబాటులోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
భువనగిరిని అన్ని రంగాలలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. అనంతరం భువనగిరి పాత బస్టాండ్ మార్కెట్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని, భక్తులు, ప్రజలకు స్వయంగా అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ అధికారులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

