కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా, ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ నిర్ణయాలపై మాజీ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 13న జరిగిన ఈ పోరులో హైదరాబాద్ నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ విఫలమైంది. ముఖ్యంగా కెప్టెన్ రియాన్ పరాగ్ కేవలం 4 పరుగులు చేసి నిరాశపరిచారు. పరాగ్ ఆటతీరుపై స్పందించిన శ్రీకాంత్.. అతను కేవలం స్టైల్ కోసమే తప్ప మరే ప్రయోజనం లేదని ఎద్దేవా చేశారు. ఈ సీజన్‌లో ఐదు మ్యాచుల్లో కేవలం 49 పరుగులు మాత్రమే చేసిన పరాగ్, బ్యాటింగ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారని విమర్శించారు. మ్యాచ్ గమనాన్ని మార్చిన కీలక అంశాలపై శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో విశ్లేషించారు. రాజస్థాన్ బౌలర్లు సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, రవి బిష్ణోయ్ తమ 11 ఓవర్లలో ఏకంగా 142 పరుగులు సమర్పించుకోవడమే ఓటమికి ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఆర్చర్, నండ్రే బర్గర్ ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ, మిగిలిన బౌలర్లు విఫలం కావడంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించిందని చెప్పారు.
సందీప్ శర్మ, దేశ్‌పాండే బౌలింగ్‌ను హైదరాబాద్ బ్యాటర్లు ఊచకోత కోశారని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, రియాన్ పరాగ్ కెప్టెన్సీ నిర్ణయాలను కూడా ఆయన తప్పుబట్టారు. జట్టులో సీనియర్ ఆటగాడు, అంతర్జాతీయ అనుభవం ఉన్న రవీంద్ర జడేజా ఉండగా.. అతనికి ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. క్రీజులో ఎడమచేతి వాటం బ్యాటర్ ఉన్నాడనే సాకుతో జడేజాను పక్కన పెట్టడం అర్థరహితమని, ఇది రాజస్థాన్ అతివిశ్వాసానికి నిదర్శనమని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు.

