కలం, హనుమకొండ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద వంటావార్పుతో నిరసన (BRS Protest) చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు, అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును విస్మరిస్తోందని విమర్శించారు. 1000 రోజుల పాలన హామీల అమలులో పూర్తిగా విఫలమైన ‘దగా పాలన’గా మారిందని ఆరోపించారు. పెన్షన్లు, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం వంటి హామీలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. మహిళలు, గర్భిణీలు, చిన్నారుల సంక్షేమానికి గతంలో అమలు చేసిన కేసీఆర్ కిట్ వంటి కార్యక్రమాలను కొనసాగించకపోవడం, కల్యాణ లక్ష్మి పథకం అమలులో జాప్యం చేయడం వల్ల పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.
విద్యార్థినులకు స్కూటీలు, యువతకు ఉపాధి అవకాశాల వంటి హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలని, హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే నిరసనగానే వంటావార్పు చేపట్టామని తెలిపారు. హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మాజీ డివిజన్ అధ్యక్షులు, మహిళా డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వికలాంగులు పాల్గొన్నారు.

