కలం, నిర్మల్: ఎన్నికలకు ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ జడ్పీ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి (Koripelly Vijayalakshmi ) ఆరోపించారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనపై నిరసనగా నిర్మల్ (Nirmal) జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మహిళా గర్జన సభ (Womens Garjana Protest) నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. హామీల అమలు కోసం మహిళలు ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మాత్రం కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. హామీలు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని, మహిళల సమస్యలపై మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

