కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Protest) పిలుపు మేరకు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో శుక్రవారం వంటావార్పు కార్యక్రమం, సదస్సులు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాలు చేశారు.
మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాలకు భారీగా తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్‌కు ప్రత్యామ్నాయంగా హామీలు, కళ్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళలకు స్కూటీలు వంటి అనేక హామీలు ఇచ్చిందని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేసిందని గణేష్ బిగాల ఆగ్రహం వ్యక్తం చేశారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? మహిళలకు ఇచ్చిన హామీలు ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షులు, సిర్ప రాజు, మాజీ NUDA చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, సత్య ప్రకాష్, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డి, ప్యాట సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

