కలం, వరంగల్ బ్యూరో: అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు నేరుగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు (KR Nagaraju) అన్నారు. వర్ధన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. కట్రాల గ్రామానికి చెందిన మహమ్మద్ షమీమ్ హమ్మద్, ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కందగట్ల సుభద్ర – వెంకటేశ్వర్లు, తాళ్లపల్లి సుజాత – రాజు కుటుంబాలు, అలాగే పర్వతగిరి మండల పరిధిలోని పర్వతగిరి టౌన్‌కు చెందిన బొట్ల మహేంద్ర – కుమారస్వామి, కాసల మంగమ్మ, చింతకుంట్ల స్వరూప – బిక్షపతి, పటేల్ ఎలేంద్ర – నవీన్ కుటుంబాలు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో తమ సొంత ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకొని గృహ ప్రవేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు లబ్ధిదారుల కుటుంబాలకు కొత్త బట్టలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇంటిలో కుటుంబసభ్యులు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కల తీర్చడం ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. గ్రామాల్లో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకుని గృహప్రవేశం జరుపుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనమన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయుబ్, వర్ధన్నపేట మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

