కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ ( Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత వారం రోజుల్లో 151 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయని పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. వారికి కోర్టు 10 లక్షల 40 వేల జరిమానా విధించిందని వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పీఎస్ లలో ఈ తనిఖీలు కొనసాగాయని పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టుబడిన వారిని నిజామాబాద్ , బోధన్, అర్మూర్ కోర్టులలో హాజరు పర్చగా.. ఇందులో 11 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని తెలిపారు. మిగిలిన వారికీ 10,40,000/- జరిమానా విధించారని చెప్పుకొచ్చారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపంలో వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు. పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఈ సందర్బంగా పలు సూచనలు కూడా చేశారు. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడుతుందని హెచ్చరించారు.
మద్యం తాగి వాహనం నడిపడం వల్ల ఊహించని ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్సు లభించదని గుర్తు చేశారు. మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్ వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదవుతాయని అలాగే జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఒక సారి కంటే ఎక్కువ సార్లు పట్టుబడినట్లయితే జైలు శిక్ష విధిస్తారని తెలిపారు. మోటర్ వెహికల్ యాక్ట్ 1989 (చట్టం సవరణ – 2019) అమలులో ఉన్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడినట్లయితే 10,000/- జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించబడునని అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి పట్టుబడినట్లైతే 15,000/- జరిమానా లేదా జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు.

